మ‌మ‌త‌దే ఈ విజ‌యం.. ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకుంటాం

ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ సాధించిన విజ‌యం పూర్తిగా మ‌మ‌తా బెన‌ర్జీ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని  బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ రాష్ట్ర ఇన్ ఛార్జ్  కైలాష్ విజ‌య్‌వ‌ర్గియ‌ త్లెఇపారు. ఈ ఓట‌మి త‌ర్వాత తాము ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటామ‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

” ప్ర‌జ‌లు దీదీకే ప‌ట్టం క‌ట్టారు. ఆమెనే సీఎం కావాల‌ని కోరుకున్నారు. ఎక్క‌డ త‌ప్పు జ‌రిగిందో మేము ఆత్మ‌పరిశీల‌న చేసుకుంటాం. సంస్థాగత స‌మ‌స్య‌లా, లేక ఇన్‌సైడ‌ర్‌, ఔట్‌సైడ‌ర్ చ‌ర్చ వ‌ల్లా అన్న‌ది చూడాలి. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో మేము చూస్తాం” అని ఆయ‌న ప్రకటించారు. 

”ఇలాంటి ఫలితాలను మేము ఊహించలేదు. అయితే ఊహించనిదే జరుగుతోంది. బయట వ్యక్తులంటూ మమతా బెనర్జీ పదేపదే ప్రస్తావించిన అంశం, ఆమె కాలికి గాయం కావడం టీఎంసీకి ఎక్కువ సీట్లు రాబట్టడంలో కీలక పాత్ర పోషించాయి” అని కైలాస్ విజయవర్గీయ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇలా ఉండగా, బెంగాల్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లు మొత్తం ఓటర్లలో 49 శాతం వరకూ ఉన్నారు. సైలెంట్‌ ఓటర్లుగా పేరున్న మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో టీఎంసీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ అభ్యర్ధుల్లో 17 శాతం అంటే 50 మంది మహిళా అభ్యర్ధులను టీఎంసీ తమ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిపింది.

మహిళా ఓటర్లలో ఉన్న సానుకూలతను మరింత పరిపుష్టం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ౩౩ శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని, మహిళలకు ఉచిత రవాణా అందుబాటులోకి తెస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు గుప్పించినా మహిళా ఓటర్లు దీదీకి బాసటగా నిలిచారు.