‘రాజకీయ ఇస్లాం’తో ఫ్రాన్స్ లో సైనిక తిరుగుబాటు!

‘రాజకీయ ఇస్లాం’తో ఫ్రాన్స్ లో సైనిక తిరుగుబాటు!

`రాజకీయ ఇస్లాం’ కారణంగా ఫ్రాన్స్ లో సైనిక తిరుగుబాటు తప్పదా? ఈ విషయమై  హెచ్చరిస్తూ వెయ్యి మంది సైనికాధికారులు రాసిన బహిరంగ లేఖ ఫ్రాన్స్ లో కలకలం రేపుతున్నది.  జిహాదీల కార్యకలాపాల కారణంగా అంతర్యుద్ధం తప్పదని స్పష్టం చేస్తున్నారు. 

ఇస్లామిస్టులపై కఠినంగా వ్యవహరించడంలో దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ విఫలమవడమే ఈ పరిణామాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు. చివరికి దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో పదవిలో ఉన్న, పదవీ విరమణ పొందిన సైనికాధికారులు ఉన్నారు. ఈ బహిరంగ లేఖను ఇటీవలే అత్యంత జాతీయవాద పత్రిక ప్రచురించింది.

1961నాటి సైనిక తిరుగుబాటు విఫలమై 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ బహిరంగ లేఖను సైనికాధికారులు రాశారు. దీనిపై సంతకాలు చేసినవారిలో 20 మంది రిటైర్డ్ జనరల్స్ ఉన్నారు. ఈ లేఖ ఫ్రెంచ్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 1961లో అప్పటి దేశాధ్యక్షుడు చార్లెస్ డీ గౌల్లేకు వ్యతిరేకంగా ఫ్రెంచ్ ఆర్మీ జనరల్స్ తిరుగుబాటు చేశారు. అల్జీరియాకు స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని ఆపేందుకు వీరు తిరుగుబాటు చేశారు. 

ఇదిలావుండగా, ఈ బహిరంగ లేఖను రాసినవారిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 18 మంది సైనికులపై ఆంక్షలు విధించారని, వీరిని సీనియర్ మిలిటరీ కౌన్సిల్ సమక్షంలో హాజరుపరుస్తారని తెలుస్తోంది.  ఇతర సంతకందారులపై కూడా చర్యలు తప్పవని సమాచారం. దేశానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టమని తమ సహచరులకు చెప్పడం ద్వారా వీరంతా మిలిటరీ రూల్స్‌ను ఉల్లంఘించారని ఫ్రెంచ్ డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది.

మరోవైపు ఈ లేఖను 58 శాతం మంది ఫ్రెంచ్ ప్రజలు సమర్థిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. గడచిన ఏడు నెలల్లో జరిగిన ఉగ్రవాద దాడులను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ దేశవ్యాప్తంగా నిఘాను కట్టుదిట్టం చేయాలని తలపెట్టారు.  జీహాదీలు, అతివాదుల వెబ్‌సైట్లలో జరిగే కార్యకలాపాలను గుర్తించడానికి ఆల్గోరిథమ్స్‌ను వాడాలని ప్రయత్నిస్తున్నారు.