రైల్వే ప‌రిస‌రాల్లో మాస్క్ లేకపోతే రూ 500 జరిమానా 

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి రోజురోజుకి అధికమౌతోంది. దీంతో కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. కరోనా వ్యాప్తి చెంద కుండా అడ్డుకునేందుకు మాస్కులు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా  రైల్వే స్టేషన్లలో, రైళ్లలో కూడా మాస్కులు ధరించాల్సిందేనని, లేకుంటే రూ. 500 జరిమానా చెల్లించాల్సి వుంటుందని కేంద్రం ఆదేశించింది. రైల్వే చట్టం ప్రకారం ఇది నేరంగా కూడా పరిగణించబడుతుందని కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. వీటికి సంబంధించిన తాజా ఉత్తర్వులను శనివారం కేంద్ర రైల్వే శాఖ జారీ చేసింది. 

ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రైల్వే స్టేషన్‌లలో ఉమ్మేసిన వారికి కూడా జరిమానాలు విధించబడతాయని తెలిపింది. వైరస్‌వ్యాప్తిని నివారించేందుకు ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన కరోనా నిబంధనలను ప్రయాణికులు తప్పనిసరిగా పాటించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 

2020 మే 11న భారత రైల్వే ప్రయాణికుల కోసం జారీ చేసిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఒపి) ప్రకారం .. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్‌ తప్పనిసరని ప్రకటించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. మాస్కులు తప్పనిసరి చేయడం, అలాగే మాస్కులు ధరించని వారికి జరిమానా విధించడాన్ని కూడా భారతీయ రైల్వే నిబంధనలు 2012లో జాబితా చేసినట్లు తెలిపింది.