క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌తోనే మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 2.34 ల‌క్ష‌లు దాటడం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. భార‌త్ లో కొవిడ్-19 కేసుల వ్యాప్తికి ప‌లు కార‌ణాలున్నాయ‌ని ఎయిమ్స్ చీఫ్ డాక్ట‌ర్ ర‌ణదీప్ గులేరియా పేర్కొన్నారు. 

ఈ ఏడాది జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రిలో వ్యాక్సినేష‌న్ ప్రారంభం కావ‌డం, కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప్ర‌జ‌లు కొవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌డం నిలిపివేశార‌ని ఇదే స‌మ‌యంలో నూత‌న వేరియంట్లు దేశంలో విపరీతంగా వ్యాప్తి చెందాయ‌ని తెలిపారు.

కేసుల సంఖ్య ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెర‌గ‌డంతో ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ఒత్తిడి నెల‌కొంద‌ని చెప్పారు. మ‌నం తక్ష‌ణ‌మే కేసుల సంఖ్య‌ను క‌ట్ట‌డి చేయాల్సి ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఆస్ప‌త్రుల్లో ప‌డ‌క‌లు, మౌలిక వ‌స‌తుల‌ను మెరుగుప‌ర‌చాల‌ని సూచించారు.

 దేశంలో మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు, ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని వీటిని కొవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నియంత్రిత ప‌ద్ధ‌తిలో చేప‌ట్టాల‌ని అన్నారు. మ‌రోవైపు ఏ వ్యాక్సిన్ కూడా వైర‌స్ నుంచి వంద శాతం ర‌క్షణ ఇవ్వ‌ద‌ని, అయితే వ్యాక్సిన్ ద్వారా యాంటీ బాడీలు పెరిగి వ్యాధి తీవ్ర‌త‌ను త‌గ్గిస్తాయ‌ని చెప్పారు.

మరోవంక, దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కేంద్ర ప్రభుత్వానికి పలు కీలకమైన సూచనలు చేసింది. రెండు నెలల పాటు ఇండోర్ సమావేశాలను నిషేధించాలని టాస్క్‌ఫోర్స్ తేల్చి చెప్పింది. అయితేనే కరోనా కాస్తో కూస్తో తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. 

అలాగే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మత పరమైన సభలు, రాజకీయ సభలు, సామాజిక పరమైన కార్యక్రమాలు కూడా కొనసాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ కేంద్రానికి ఓ కీలకమైన రిపోర్టును సమర్పించింది. 

‘‘మరో రెండు నెలల పాటు 10 మంది కంటే ఎక్కువగా గుమిగూడకుండా తాత్కాలికంగా నిషేధం విధించాలని మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాం’’ అని టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పేర్కొంది.