కుంభమేళాను మర్కజ్‌తో పోల్చొద్దు

కరోనా కల్లోలం నేపథ్యంలో గతేడాది జరిగిన మర్కజ్ ఘటనతో కుంభమేళాను పోల్చవద్దని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరథ్ సింగ్ రావత్ హితవు చెప్పారు. కుంభమేళా కోసం హరిద్వార్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 
 
కుంభమేళా 12 ఏళ్లకు ఓ సారి వస్తుందనీ, అత్యంత వైభవంగా, సువిశాల విస్తీర్ణంలో పుణ్య స్నానాలు ఆచరించడం జరుగుతుందని సీఎం తెలిపారు. మర్కజ్‌లో మాదిరిగా కాకుండా కుంభమేళాకు కేవలం మన దేశం నుంచి మాత్రమే భక్తులు వస్తారని ఆయన గుర్తుచేశారు.
 
 ‘‘మర్కజ్‌లో కొవిడ్-19 కేసులు వెలుగుచూసినప్పుడు పరిస్థితి వేరేగా ఉంది. అక్కడ కనీసం అవగాహన కూడా లేదు. మర్కజ్ కార్యక్రమం ఓ భవనానికి పరిమితమైంది. కానీ కుంభమేళా అనేక కిలోమీటర్లు విస్తరించి ఉంది. మర్కజ్‌లో కనీసం తనిఖీలు లేవు. వారంతా గంటల తరబడి ఒకేచోట ఉన్నారు..’’ అని ఆయన వివరించారు. 
 
కుంభమేళా కేవలం హరిద్వార్‌లోనే కాదనీ, పుణ్య స్నానాల కోసం 16 ఘాట్లు ఉన్నాయని తెలిపారు. ఒక్కో ఘాట్ పరస్పరం దూరంగా ఉన్నందున, వివిధ సెషన్లలో భక్తులు స్నానాలు చేయవచ్చని సూచించారు. 
 
అధిక రద్దీని నివారించేందుకు అఖాడాలు, పేష్వాయిలకు ప్రత్యేక సమయాలు కేటాయించాం. కాబట్టి కుంభమేళాను ఇతర కార్యక్రమాలతో పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. కుంభమేళా గంగానదీ తీరంలో ఆచరిస్తున్నందున గంగా మాత ఆశీస్సులు కూడా భక్తులకు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.
 హరిద్వార్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళా ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న వేళ కుంభమేళాను నిలిపివేసేందుకు ఎలాంటి చర్చలు జరుగలేదని అధికారులు తెలిపారు. రెండువారాల ముందుగానే కార్యక్రమాన్ని ముగించే చర్యలను ఖండించారు. వాస్తవానికి కుంభమేళా జనవరిలో ప్రారంభమయ్యేది. కానీ, కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ఏప్రిల్‌లో నిర్వహించాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.