పెన్షన్‌ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐ పెంపు?

పెన్షన్‌ రంగంలో విదేశీ పెట్టుబడులను 74 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు చెబుతున్నారు. పెన్షన్‌ రంగంలో ప్రస్తుతం 49 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉన్నది
 
ఈ పరిమితిని పెంచాలంటే పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చట్టానికి సవరణలు చేయాలి. దీంతో పాటు ఇదే సవరణ బిల్లు ద్వారా నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ ట్రస్టును (ఎన్‌పీఎస్‌ ట్రస్టు) పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి వేరు చేయనున్నట్టు తెలుస్తున్నది. 
 
దీనిని కంపెనీల చట్టం పరిధిలోకి తెచ్చి 15 మంది సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేయనున్నారు. అసంఘటిత రంగంలో ఉన్నవారికి కూడా మెరుగైన పెన్షన్‌ ఫలాలు అందడం కోసం ఈ నిర్ణయం తీసుకొన్నారు.
 
గత నెలలో జరిగిన సమావేశాల్లో బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 74 శాతానికి పెంచే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఇందుకోసం బీమా చట్టం 1938 సవరించింది. ఇంతకు ముందు 2015లో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడంతో గత ఐదేళ్ల కాలంలో బీమా రంగంలోకి రూ.26,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. 
 
అదే విధంగా పెన్షన్‌ రంగంలో కూడా ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ పిఎ్‌ఫఆర్‌డీఏ చట్టం 2013కి సవరణ ప్రతిపాదించే ఆస్కారం ఉన్నట్టు అభిజ్ఞ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎన్‌పీఎస్‌ ట్రస్టును పీఎ్‌ఫఆర్‌డీఏ నుంచి వేరు చేసే అవకాశం కూడా ఉన్నదంటుని భావిస్తున్నారు. 
 
గతంలోని డిఫైన్డ్‌ పెన్షన్‌ వ్యవస్థ స్థానంలో ఎన్‌పీఎస్ ను (జాతీయ పెన్షన్‌ స్కీమ్‌) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2004 జనవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ సర్వీసుల్లో కొత్తగా చేరే వారందరూ ఎన్‌పీఎ్‌సను తీసుకోవడం తప్పనిసరి చేశారు. తదుపరి 2009 మే ఒకటో తేదీ నుంచి స్వచ్ఛందంగా చేరే ప్రాతిపదికన ఎన్‌పీఎ్‌సను జనాభా అందరికీ విస్తరించారు.