మమతపై దాడి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

మమతపై దాడి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్‌లో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీపై జరిగిన దాడి ఘటనపై దాఖలైన ఒక పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. ఈ ఘనటపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ అడ్వకేట్ వివేక నారాయణ్ శర్మ ‘పిల్‌’ వేశారు. దీనిపై విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని త్విసభ్య బెంచ్ నిరాకరిస్తూ, కోల్‌కతా హైకోర్టుకు పిటిషనర్ వెళ్లవచ్చని పేర్కొంది.
 
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్నందున, ఇలాంటి దాడి ఘటనల ప్రభావం ఎన్నికల యంత్రాంగంపై పడకుండా ఉండేందుకు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఒక తాత్కాలిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ధర్మాసనాన్ని న్యాయవాది నారాయణ్ శర్మ కోరారు.
 
రాజ్యాంగ పదవి నిర్వహిస్తున్న వ్యక్తిపై దాడి జరిగినందున ఎన్నికల యంత్రాంగంపై ఓటర్ల విశ్వాసం సన్నగిల్లే అవకాశముందని, నందిగ్రామ్ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కూడా పిటిషనర్ కోరారు. నందిగ్రామ్‌లో జరిగిన ఘటనలో మమతా బెనర్జీ కాలికి గాయమైంది. ఈ దాడి వెనుక బీజేపీ ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించగా, వాటిని బీజేపీ తోసిపుచ్చింది. సానుభూతి పొందడం కోసమే టీఎంసీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందంటూ ప్రత్యారోపణలు చేసింది.