ఏసీ, ఎల్‌ఈడీల తయారీకి పీఎల్‌ఐ స్కీమ్‌

ఎయిర్‌ కండిషనర్‌, ఎల్‌ఇడి విద్యుత్‌ దీపాలు, సోలార్‌ పివి మాడ్యుల్స్‌ తయారీ సంస్థలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకం వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం వైట్‌ గూడ్స్‌ (ఏసి, ఎల్‌ఇడి లైట్స్‌) రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందించేందుకు రూ.6,238 కోట్ల మేర వెచ్చించాలని నిర్ణయించింది. 

ఈ పథకం ద్వారా విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఎగుమతులు పెరుగుతాయని కేంద్రం ఆశిస్తోంది. ఏసిలు, ఎల్‌ఇడి లైట్ల తయారీ సంస్థలకు ఐదేళ్ల కాలానికి దేశంలో తయారయ్యే వస్తువుల అమ్మకాలపై 4 శాతం నుంచి 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న సంస్థలు, కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. 

రానున్న ఐదేళ్లలో పిఎల్‌ఐ పథకం వల్ల రూ.7,920 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.64,400 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని, ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో రూ.49,300 కోట్ల ఆదాయం సమకూరడమే కాకుండా నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేసింది.

అధిక సామర్థ్యం కలిగిన గిగావాట్‌ శ్రేణి సోలార్‌ పివి మాడ్యుల్స్‌ తయారీకి ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ హై ఎఫిషియెన్సీ సోలార్‌ పివి మాడ్యుల్స్‌’ పేరుతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకం వర్తింపజేస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ. 4,500 కోట్లు ప్రోత్సాహకాలుగా వెచ్చించనుంది.

దేశీయ సామర్థ్యం పెంపు కోసం పిఎల్‌ఐ స్కీమ్‌ అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. తయారీదారులను పారదర్శకమైన కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ప్లాంట్ల ఏర్పాటు తరువాత ఐదేళ్లపాటు ప్రోత్సాహకాలను అందిస్తారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.17,200 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 30 వేల మందికి ప్రత్యక్షంగా, 1,20,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం పేర్కొంది.