ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత కలలు నెరవేరుతాయని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. సినీ నటి, బీజేపీ అభ్యర్థి కుష్బూ సుందర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఆమె పోటీ చేస్తున్న థౌజెండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే అవినీతిమయ డీఎంకే-కాంగ్రెస్ కూటమిని మరోసారి ఓడించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చాలా చక్కగా పనిచేస్తున్నారని అమిత్ షా కితాబిచ్చారు.
అందుకే ప్రజలు మరోసారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలని, ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని షా కోరారు. కుష్బూతో కలిసి రోడ్ షోలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి.. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే-కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు.
తమిళనాడులో ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తిరునెల్వెలిలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ డీఎంకేను రాజవంశ రాజకీయాలతో పోల్చిన ఆయన ఈ ఎన్నికలే రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ధారించబోతున్నాయని వెల్లడించారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రాంచంద్రన్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎన్డీయే కూటమికి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
‘‘ఈ అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు ఎంతో కీలకం. తమిళనాడు రాజవంశం మార్గంలో నడుస్తుందా లేదంటే మక్కల్ తిలగం ఎంజీ రాంచంద్రన్ దారిలో నడుస్తుందా అని తేల్చేందుకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి” అని అమిత్ షా హెచ్చరించారు. తమిళనాడు ప్రజలు ఎటువైపు ఉన్నారు? రాజవంశం వైపా లేదంటే ఎంజీ రాంచంద్రం వైపా? అని ఎన్నికల ప్రచార సభకు విచ్చేసిన ప్రజలను అమిత్ షా ప్రశ్నించారు.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో స్మృతి మంధాన