
శ్రీలంకలోని జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్రమోదీయేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుర్తు చేశారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న నడ్డా తమిళులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో మోదీ పర్యటించడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. శనివారం ఈరోడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ జాఫ్నాలో బాంబ్ దాడి నిర్వాసితులకు చేసిన సాయాన్ని వివరించారు.
‘‘ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా జాఫ్నాలో పర్యటించలేదు. ఆ ప్రాంతంలో పర్యటించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్రమోదీనే. అక్కడ పర్యటించడమే కాకుండా బాంబు దాడి నిర్వాసితులకు ఇళ్లు నిర్మించుకోవడానికి సహాయం చేశారు” అని తెలిపారు.
పైగా, విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్‌ను కూడా అక్కడికి పంపించారని, ఆ ప్రాంతంలో ఉన్న మైనారిటీలైన తమిళలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. కానీ స్టాలిన్ మాత్రం కరుప్పర్ కొట్టాం సంఘటనను ఇప్పటి వరకు ఖండించలేదని నడ్డా ఎద్దేవా చేశారు.
అస్సాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవ చేయడం తెలియదని, కేవలం ప్రజలను మోసం చేయడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి మరోపేరు మోసం అంటూ ఆయన మండిపడ్డారు.
అసోంలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు అధికారంలో ఉండి కూడా తేయాకు తోటల కార్మికుల కోసం ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. వారు అధికారంలో ఉన్నన్ని రోజులు రాజకీయ పర్యాటకం కోసం మాత్రమే రాష్ట్రాన్ని వినియోగించుకున్నారని ఆరోపించారు.
మన్మోహన్ సింగ్ 10 ఏండ్లు ప్రధానిగా ఉన్నా అసోంకు కనీసం పదిసార్లు కూడా రాలేదని, నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రానికి 35 సార్లు వచ్చారని నడ్డా చెప్పారు.
More Stories
క్రమేపీ తగ్గిపోతున్న నోటా ఓట్ల శాతం
ట్రంప్‌తో భేటీలో ప్రధాని హుందాగా నడుచుకున్నారు
మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణ