విశాఖ ఉక్కుకు రూ 1,340 కోట్ల లాభం 

నష్టాలలో కూరుకు పోయిన కారణంగా ప్రైవేట్ పరం చేయడమో లేదా మూసి వేయడమే తప్ప  మరో మార్గం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న సమయంలో  వైజాగ్ స్టీల్స్ టర్నోవర్‌ రూ.18 వేల కోట్లు సాధించామని, కర్మాగారం చరిత్రలోనే రెండో అత్యధికమని సీఎండీ పీకే రథ్‌ వెల్లడించారు.
 
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2020ా21 ఆర్థిక సంవత్సర కాలంలో సుమారు రూ.1,240 కోట్లు ఉత్పత్తి లాభం ఆర్జించినట్లు వెల్లడైనది. విశాఖ ఉక్కు ప్రగతిపై సీనియర్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో గత ఆర్థిక ఏడాదిలో కర్మాగారం 13 శాతం వృద్ధి నమోదయిందని, ఉత్పత్తి 5 శాతం జరిగినదని పేర్కొన్నారు.
‘‘2020-21లో మంచి ఫలితాలు సాధించాం. ఉత్పత్తి, అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించాం. ఒక్క మార్చి నెలలోనే రూ.3,300 కోట్ల అమ్మకాలతో అందరి దృష్టి ప్లాంటు వైపు మళ్లింది’’ అని సిఎండి పేర్కొన్నారు. ఈ నాలుగు నెలల్లో రూ.740 కోట్ల నికర లాభం నమోదైందని సీఎండీ తెలిపారు. కర్మాగారంలో ఒక్క నెలలో ఇంత ఆదాయం రావడం ఇదే తొలిసారి.
 
మార్చిలో 7,11,000 టన్నుల ఉక్కు రూ.3,300కోట్లకు విక్రయించామని చెప్పారు. కర్మాగారం చరిత్రలో ఈ మార్చిలో అత్యధిక ఆదాయం వచ్చిందని పీకే రథ్‌ తెలిపారు. ‘‘ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులు. కానీ, ఈ ఏడాది అంతకు మించి ఉత్పత్తి జరిగింది.  అందులో 45 లక్షల టన్నులు విక్రయించాం’’ అని పేర్కొన్నారు.
 
విదేశాలకు 13 లక్షల టన్నులు ఎగుమతి చేశామని, ఇది అంతకు ముందు కంటే 261 శాతం అధికమని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలకు రూ.10 కోట్లు వెచ్చించామని తెలిపారు. విశాఖ ప్లాంటులో మూడు బ్లాస్ట్‌ఫర్నే్‌సలు ఉండగా… గత కొంతకాలంగా ఒక్కటే పనిచేస్తోంది. మరోవైపు… విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు ఆందోళనలూ చేస్తున్నారు. అయినా… ఉత్పత్తిపై ప్రభావం పడకుండా, అదనపు ఉత్పత్తి సాధించడం గమనార్హం.
 కాగా, విశాఖ ఉక్కు విక్రయంపై కేంద్రం  వివిధ మంత్రిత్వ శాఖలతో ప్రత్యేక బృందాన్ని (ఇంటర్‌ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్ట్రీస్‌ ఆన్‌ స్ట్రాటజిక్‌ సేల్‌ ఆఫ్‌ విశాఖ స్టీల్‌ప్లాంట్‌) నియమించింది. ఈ కమిటీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విక్రయ విధి విధానాలను రూపొందిస్తుంది. కర్మాగారానికి ఒక వెల కడుతుంది. 
లీడ్‌ బ్యాంకర్‌గా ఎవరిని నియమించాలో పరిశీలిస్తుంది. ఈ మొత్తం అంశాలపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ కమిటీలో కేంద్ర ఆర్థిక, పరిశ్రమల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు.