ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీ ఇంట్లో వసూళ్ల ముఠా 

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీ ఇంట్లో వసూళ్ల ముఠా 

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు  ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి  ముగ్గురు వ్యక్తులు లంచం డిమాండ్‌ చేశారు. వారిని రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్‌ కుమార్‌గా గుర్తించారు. సీబీఐ సోదాల సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. తాము కవిత పీఏలమంటూ ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని ఇంటి నిర్మాణం అక్రమం అంటూ రూ. 5 లక్షల డబ్బులు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

 సీబీఐ వర్గాల కథనం ప్రకారం రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తా అనే వ్యక్తులు.. ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పైరవీల కోసం ముడుపులు డిమాండ్‌ చేశారు. సర్దార్‌నగర్‌లోని ఓ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా అధికారుల నుంచి కాపాడతామని ఆ నిర్మాణం యజమాని మన్మిత్‌సింగ్‌ లాంబాను సంప్రదించారు. అందుకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

దీంతో లాంబా సీబీఐని ఆశ్రయించారు. తనకు తొలుత రాజీవ్‌ భట్టాచార్య ఫోన్‌చేసి ఎంపీ మాలోతు కవిత పీఏగా పరిచయం చేసుకున్నాడని బాధితుడు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత శుభాంగీ గుప్తా అనే మహిళ రంగంలోకి దిగిందని చెప్పారు. ఆ తర్వాత వీరంతా రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

కవిత డ్రైవర్‌ దుర్గేశ్‌కుమార్‌ కూడా వీరితో కలిసి ఉన్నాడని మన్మిత్‌సింగ్‌ పేర్కొన్నారు. బీడీమార్గ్‌లోని సరస్వతి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ నంబర్‌-401కు డబ్బు తీసుకురావాలని రాజీవ్‌ భట్టాచార్య సూచించాడు. అప్పటికే వలపన్నిన సీబీఐ అధికారులు రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తాలను డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

వారితో పాటు ఉన్న దుర్గేశ్‌ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో అతని పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అరెస్టు చేసిన ఇద్దరూ.. తమను తాము ఎంపీ కవిత పీఏలుగా చెప్పుకొంటున్నారని, దర్యాప్తులో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు.

కాగా, దుర్గేష్‌కుమార్‌ తమ డ్రైవర్ అని, నా నివాసంలోని స్టాఫ్‌ క్వార్టర్స్‌ అతనికి ఇచ్చానని ఎంపీ కవిత సిబిఐ సోదాలపై స్పందిస్తూ  పేర్కొన్నారు. మిగిలిన వారిద్దరూ ఎవరో తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీలో తనకు పీఏలు లేరని,  పట్టుబడినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.