జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై  నీలం సాహ్ని కసరత్తు 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారిణి నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టారు. ఎపి ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగిసింది. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కొనసాగింపుపై కసరత్తు ప్రారంభించారు.
నీలం సాహ్నికి ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఎన్నికల అధికారులు అభినందనలు తెలిపారు.  రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్‌ ఐఎఎస్‌ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కు పంపించింది. ఈ క్రమంలో నీలం సాహ్నిని ఎస్‌ఇసిగా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను నీలం సాహ్ని కలిసి  రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై  చర్చించారు. కాగా, నీలం సాహ్నిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదిత్యనాథ్‌ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ, సీఎస్ చర్చించారు.
ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్‌ఈసీని సీఎస్ కోరారు. ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని సీఎస్ తెలిపారు.‌ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలపై చర్చించారు. ఈ విషయమై ఆమె కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు.
గత ఏడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియ మిగిలి ఉంది. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది కాకుండా ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. శుక్రవారం ఉదయం ఈ విషయమై అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
 
కాగా,   పరిషత్ ఎన్నికల పిటిషన్లపై ఇప్పటికే తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 3న పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉంది.  మరోవంక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.