డీఎంకే నేత‌ రాజాపై 48 గంట‌ల పాటు ప్ర‌చార‌ నిషేధం

డీఎంకే నేత, మాజీ కేంద్ర మంత్రి ఏ రాజాపై ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు విధించింది. 48 గంట‌ల పాటు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌రాదు అని త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. త‌క్ష‌ణ‌మే ఈ ఆదేశాలు అమ‌ల్లోకి రానున్నాయి. 
 
త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ప‌ళ‌నిస్వామిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఘ‌ట‌న‌లో ఈసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవ‌ల ఓ ప్ర‌చార స‌భ‌లో రాజా మాట్లాడుతూ.. సీఎం ప‌ళ‌నిస్వామి త‌ల్లి గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ ఘ‌ట‌న‌లో ఏ రాజా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. 
 
చెపాక్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే నేత రాజా సీఎం పళని స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళని జన్మించారని, ప్రీమ్యాచ్యూర్‌గా పుట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి చెందిన డాక్టర్ నరేంద్ర మోదీ ఆయనకు హెల్త్ సర్టిఫికేట్ ఇచ్చారంటూ నోరు పారేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నాడీఎంకే నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
రాజా చేసిన వ్యాఖ్య‌లు అస‌భ్య‌క‌రంగా ఉన్నాయ‌ని, మ‌హిళల గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తున్న‌ట్లు ఉన్నాయ‌ని, ఇది ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం ఆరోపించింది. ఏప్రిల్ ఆరో తేదీన త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.