రాష్ట్రపతికి స్వల్ప అనారోగ్యం.. ఆర్మీ హాస్పిటల్‌లో చేరిక

రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌ (ఆర్‌అండ్‌ఆర్‌)కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు. 

ఆసుపత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రొటీన్ చెక్-అప్ జరుగుతోందని పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఇటీవలే రాష్ట్రపతి కోవింద్ కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ మొదటి మోతాదు తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బాంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ కుమారుడు ప్రశాంత్‌తో మాట్లాడారు. రాష్ట్రపతి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ట్వీట్ ద్వారా తెలిపింది.

కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ‘‘రాష్ట్రపతి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలనీ, సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను….’’ అని ట్విట్టర్ లో తెలిపారు.