తాజాగా కొవిడ్-19 కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (మార్చి 28) నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత రికార్డులను అధిగమించి కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
పెరిగిపోతున్న కరోనా కేసులప సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్లతో చర్చించారు. కొత్తవారికి కరోనా సోకకుండా రాత్రి పూట కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపింగ్ మాల్స్ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు మూసి ఉంచుతారు. కరోనా ముప్పు తొలగిపోలేదని, అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు.
ఈ అంశాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. దీని ఆట కట్టించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి లాక్‌డౌన్ విధించాలా? వద్దా? అన్న విషయమై జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే, ప్రజలకు సరిపడా వ్యవధి ఇస్తారని చెప్పారు.
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.8 లక్షలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు రికార్డుస్థాయిలో కొత్తగా 36,902 కరోనా కేసులు, 112 మరణాలు నమోదయ్యాయి.
దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,37,735కు, మరణాల సంఖ్య 53,907కు చేరింది. అలాగే ముంబైలో శుక్రవారం గరిష్ఠంగా 5,513 కరోనా కేసులు నమోదయ్యాయి.
More Stories
నేషనల్ కాన్ఫరెన్స్ ఎల్పీ నేతగా ఒమర్ అబ్దుల్లా
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
సంఘ్ పాటల ద్వారా సామరస్యం