పార్లమెంటు నిరవధికంగా వాయిదా

పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండు విడతలుగా మొత్తం మీద 24 రోజుల పాటు జరిగిన ఈ బడ్జెట్‌ సమావేశాల్లో మొత్తం 18 బిల్లులు ఆమోదం పొందాయి. లోక్‌సభ 114 శాతం, రాజ్యసభ 90 శాతం కార్యకలాపాలు పార్లమెంటు . జనవరి 29న ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాలు గురువారంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి.

ఏప్రిల్‌8 వరకు బడ్జెట్‌ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ముగించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. స్పీకర్‌ ఓం బిర్లాకు కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా పార్లమెంటుకు దూరంగా ఉన్నారు.

రెండు విడతల్లో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో తొలివిడత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు (రాజ్యసభ, ఫిబ్రవరి 13 వరకు), రెండోవిడత మార్చి 8 నుంచి 25వరకు జరిగాయి. లోక్‌సభ సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ స్థానంలో ఉన్న భర్తృహరి మెహతాబ్‌ ప్రకటించగా, రాజ్యసభలో చైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు ఇదే విధంగా ప్రకటించారు.

బడ్జెట్‌ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 33 రోజులు, 116 గంటల పాటు సమావేశం కావాల్సి ఉండగా 23 రోజులు, 104 గంటలు మాత్రమే సమావేశమైందని వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యసభ కన్నా లోక్‌సభ ఒక రోజు అదనంగా సమావేశమైంది.


మొదటి విడతలో జనవరి 29న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు లోక్‌సభలో 17 గంటలు, రాజ్యసభలో 16 గంటలపాటు చర్చ జరిగింది. 
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ పై లోక్‌సభలో 15 గంటలు, రాజ్యసభలో 11 గంటల పాటు చర్చ జరిగింది.

బడ్జెట్‌ సమావేశాల్లో మొత్తం 20 బిల్లులను (లోక్‌సభలో 17, రాజ్యసభలో మూడు) ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 18 బిల్లులు, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదం పొందాయి. పార్లమెంటు ఉభయ సభలు మొత్తం 18 బిల్లులు ఆమోదించాయి. 

వీటిలో కీలకమైన గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నిర్వహణ) సవరణ బిల్లు, ఇన్సూరెన్సు సవరణ బిల్లు, మధ్యవర్తిత్వం, సయోధ్య (సవరణ) బిల్లు, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లు, మేజర్‌ పోర్ట్‌ అథారిటీస్‌ బిల్లు, మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ (సవరణ) బిల్లు, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌ బిల్లు, రాజ్యాంగ (షెడ్యూల్డ్‌ కులాల) ఆర్డర్‌ (సవరణ) బిల్లు, జాతీయ రాజధాని, ఢిల్లీ ప్రాంత చట్ట (సవరణ) బిల్లు వంటివి ఉన్నాయి.