దీదీ గద్దె దిగే వరకు బెంగాల్‌ను మలేరియా వదలదు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ మలేరియా, డెంగ్యూలతో సావాసం చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఆరోపించారు. ఆమె గద్దె దిగే వరకు రాష్ట్రాన్ని ఈ వ్యాధులు వదిలిపెట్టబోవని స్పష్టం చేశారు. 

ఝార్‌గ్రామ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ  ‘‘దీదీ (మమత బెనర్జీ) ప్రభుత్వం పోయే వరకు మీరు మలేరియా నుంచి బయటపడరు. ఆమె డెంగ్యూ, మలేరియాలతో స్నేహం చేస్తున్నారు. మాకు ఓటు వేయండి, మేం రెండేళ్ళలో ఈ వ్యాధులను నిర్మూలిస్తాం’’ అని అమిత్ షా భరోసా ఇచ్చారు.

ఓ వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గిరిజన సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, మరోవైపు దీదీ తన మేనల్లుడి కోసం పాటుపడుతున్నారని చెప్తూ, ‘‘మీకు ఎవరు కావాలి?’’ అని ప్రజలను ప్రశ్నించారు.

‘ఆడుకుందాం’ అంటూ దీదీ అమాయక గిరిజనులను భయపెడుతున్నారని, అయితే ఇక్కడి చిన్న పిల్లలు సైతం ఫుట్‌బాల్ ఆడతారని ఆమెకు తెలియదని ఎద్దేవా చేశారు. ‘‘దీదీ! మీరు ఆడుకుందాం అంటే భయపడేవారెవరూ లేరు’’ అని హితవు చెప్పారు. ‘‘మాకు ఓటు వేయండి, దీదీ గూండాలు మిమ్మల్ని బాధపెట్టకుండా చూస్తానని నేను హామీ ఇస్తున్నాను’’ అని చెప్పారు.

గిరిజనులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూ, ఝార్‌గ్రామ్ అంటే గిరిజనుల గడ్డ అని, అడవులు, ఎర్ర మట్టితో కూడిన ప్రాంతమని తెలిపారు. ‘అమ్మ, పుట్టిన గడ్డ, ప్రజలు’’  అనే నినాదంతో గద్దెనెక్కిన మమత బెనర్జీ ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు.

తాగునీరు కూడా ప్రజలకు అందుబాటులో లేదన్నారు. దీదీని వదిలిపెట్టి, మోదీ గారి కమలానికి ఓటు వేయాలని కోరారు. ఐదేళ్ళలో తాగు నీటిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.