పాలేరు నుంచి పోటీకి వైఎస్ షర్మిల సై 

పాలేరు నుంచి పోటీకి వైఎస్ షర్మిల సై 
ఏప్రిల్ 9న ఖమ్మంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించిన ప్రకటనకు సన్నాహాలు చేస్తున్న దిగవంత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిల తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి తాను పోటీ చేస్తానని వైఎస్‌ షర్మిల వెల్లడించారు.
ఆమె లోటస్‌ పాండ్‌లోని తన కార్యాలయంలో ఆ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌ అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌ సానుభూతిపరులు మాట్లాడుతూ.. అధికార పక్షంతో ఎదురవుతున్న ఇబ్బం దులను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.  ప్రస్తుత పరిస్థితుల్లో రాజన్న సంక్షేమ పాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా మీరు వేసే అడుగులో అడుగు వేస్తామని చెప్పారు.

షర్మిల మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగేనని, పాలేరు నుంచే బరిలోకి దిగుతానని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరని ఆమె స్పష్టం చేశారు.  ఏప్రిల్‌ 9న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ విధి విధానాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. సభకు పోలీసు అనుమతులు సైతం లభించి నట్లు షర్మిల తెలిపారు. సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌ అభిమానులను కోరారు.

ఇలా ఉండగా, వచ్చే నెల 9న లక్ష మందితో ఖమ్మంలో తలపెట్టిన షర్మిల సభకు కొవిడ్‌ చిక్కులు ఏర్పడ్డాయి. ప్రజల ముందు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె చేసుకుంటున్న ఏర్పాట్లకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బృందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న పెవిలియన్‌ గ్రౌండ్‌లో కేవలం ఆరు వేల మందితో సభను నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతినిచ్చారు.

అది కూడా కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల లోపునే సభ నిర్వహించుకోవాలని సూచించారు. కాగా, గురువారం 10 ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో లోట్‌సపాండ్‌లో షర్మిల సమావేశం కానున్నారు. ఇందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 9న నిర్వహించన్ను సభకు జనసమీకరణ, ఇతర అంశాలపైన చర్చిస్తారని చెబుతున్నారు. ఈ సమావేశం తర్వాత ఖమ్మం సభపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.