గతంలో మాదిరిగా మళ్ళి లాక్ డౌన్ అవసరం లేదు 

ఇటీవల కోవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ గతంలో మాదిరిగా మళ్ళీ అష్టదిగ్బంధనాల అవసరం ఉండదని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) చీఫ్ శక్తికాంత దాస్ గురువారం చెప్పారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ ఆటంకాలు లేకుండా కొనసాగాలని స్పష్టం చేశారు. 

ఈ మహమ్మారి పెరుగుతుండటం ఆందోళనకరమే అయినప్పటికీ మన దేశం ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందని భరోసా వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుండటాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ జరిగిందని, ఇది ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. ఈసారి కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని తట్టుకోవడానికి మనకు కొంత అదనపు భరోసా ఉందని తెలిపారు. ఆయన పరోక్షంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను గుర్తు చేశారు. 

2021-22 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన వృద్ధి రేటు 10.5 శాతంలో తగ్గుదల ఉంటుందని తాను భావించడం లేదని చెప్పారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా తాను ఈ వివరాలను చెప్తున్నట్లు తెలిపారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష అనంతరం ఏప్రిల్ 7న తుది అంచనాలు వెల్లడవుతాయని చెప్పారు. 

ఆర్బీఐ, బాండ్ మార్కెట్ మధ్య జగడం లేదని పేర్కొంటూ ఈ రెండూ పరస్పరం సహకారాత్మకంగా కొనసాగాలని, ఘర్షణాత్మకంగా ఉండకూడదని చెప్పారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌తోపాటు ఇతర చర్యల ద్వారా మార్కెట్‌కు ఆర్బీఐ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. రుణ సేకరణ సజావుగా జరగడానికి ఆర్బీఐ దోహదపడుతుందని చెప్పారు. 

విదేశీ మారక ద్రవ్య నిల్వలు, కరెన్సీ మార్కెట్‌లో ఆర్బీఐ జోక్యం గురించి శక్తికాంత దాస్ మాట్లాడుతూ, కరెన్సీ నిలకడగా ఉండటం కోసం మాత్రమే ఆర్బీఐ ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. మన దేశం 2013లో ఎదుర్కొన్న ఇబ్బందులు మళ్ళీ ఎదుర్కొనకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, బుధవారం మన దేశంలో 53,476 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబరు 23 తర్వాత రోజువారీ అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.