అంచ‌నాల‌కు మించి దూసుకెళ్తోన్న భారత్ వృద్ధి 

భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచ‌నాల‌కు మించి దూసుకెళ్తోంద‌ని స్ప‌ష్టం చేసింది ఫిచ్ రేటింగ్స్‌. దీంతో 2021-22ల‌లో భార‌త జీడీపీ వృద్ధిరేటు 12.8 శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. 

గ‌తంలో తాము దీనిని 11 శాతంగా అంచ‌నా వేసినా.. లాక్‌డౌన్ కార‌ణంగా వ‌చ్చిన మాంద్యం నుంచి ఆర్థిక వ్య‌వ‌స్థ ఊహించ‌దాని కంటే వేగంగా కోలుకున్న‌ద‌ని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. 2020 రెండో అర్ధ‌భాగంలో భారత్ వేగంగా పుంజుకున్న‌ద‌ని వెల్లడించింది. 

దీంతో వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి తాము అంచ‌నా వేసిన వృద్ధిరేటును మార్చాల్సి వ‌చ్చింద‌ని త‌న తాజా గ్లోబ‌ల్ ఎక‌న‌మిక్ ఔట్‌లుక్‌లో ఫిచ్ రేటింగ్స్ చెప్పింది. అయిన‌ప్ప‌టికీ క‌రోనా మ‌హ‌మ్మారి కంటే ముందు తాము చేసిన అంచ‌నాల కంటే చాలా త‌క్కువ‌గానే భార‌త జీడీపీ ఉంటుంద‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

2020 చివ‌ర్లో వైర‌స్ కేసుల సంఖ్య త‌గ్గ‌డం, రాష్ట్రాల్లో క‌రోనా ఆంక్ష‌ల‌ను క్ర‌మంగా ఎత్తేయ‌డం వృద్ధి రేటును ప‌రుగులు పెట్టించింద‌ని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ఇక తాజా బ‌డ్జెట్ ప్ర‌కారం వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో మౌలిక స‌దుపాయాలు, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, మిలిట‌రీ రంగాల్లో ప్ర‌భుత్వం చేసే వ్య‌యాలు పెర‌గ‌నున్నాయి. 2023 ఆర్థిక సంవ‌త్స‌రానికి జీడీపీ వృద్ధిరేటు 5.8 శాతానికి చేరుతుంద‌ని ఫిచ్ రేటింగ్స్ అంచ‌నా వేసింది.