సీజేఐగా ఎన్వీ ర‌మ‌ణ పేరు సిఫార‌సు చేసిన‌ ఎస్ఏ బోబ్డే

త‌న త‌ర్వాత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్  ఎన్వీ ర‌మ‌ణ పేరును  ప్ర‌స్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే సిఫార్స్ చేశారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. దీంతో త‌న వారసుడి పేరును సిఫార‌సు చేయాల్సిందిగా ప్ర‌భుత్వం బోబ్డేను కోరింది. గ‌త శుక్ర‌వార‌మే కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఈ మేర‌కు బోబ్డేకు లేఖ రాశారు. 

దానితో జస్టిస్ ఎన్‌వీ రమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తికా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోబ్డే త‌ర్వాత ఎన్వీ ర‌మ‌ణ‌నే సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉన్నారు. 1957, ఆగ‌స్ట్ 27న జ‌న్మించిన ర‌మ‌ణ ప‌ద‌వీ కాలం 2022, ఆగ‌స్ట్ 26తో ముగుస్తుంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్‌కే చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ప‌ద‌వి ద‌క్కాల్సి ఉంటుంది.

2017, ఫిబ్ర‌వ‌రి 14 నుంచి ర‌మ‌ణ సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఉన్నారు. అంత‌కుముందు ఆరు నెల‌ల పాటు ఆయ‌న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ప‌ని చేశారు. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు ఎన్వీ ర‌మ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో జ‌డ్జిగా ప‌ని చేశారు. కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో ఆయ‌న జ‌న్మించారు.

అయితే జస్టిస్ రమణ న్యాయమూర్తి కావడానికి ముందు తెలుగు దేశం పార్టీతో సంబంధం ఉండడంతో ఆయనను ప్రధాన న్యాయమూర్తి కాకుండా చేయడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఎన్వీ ర‌మ‌ణ‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ సీజేఐకి లేఖ రాశారు.

అమ‌రావతిలో ఆయ‌న‌తోపాటు ఆయ‌న బంధువులు భూ సేక‌ర‌ణ విష‌యంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు జ‌గ‌న్ ఆరోపించారు. అంతేకాకుండా ఏపీ హైకోర్టులో జ‌రుగుతున్న విచార‌ణ‌ల‌ను ప్రభావితం చేసి త‌న ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌రిచే కుట్ర కూడా చేస్తున్న‌ట్లు జ‌గ‌న్ ఆ లేఖ‌లో చెప్పారు. దీనిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న కోరారు.

ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కూడా కలిసి ఈ విషయమై ఆరోపణలు చేశారు. అయితేజస్టిస్ బాబుదే జగన్ ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపి, సహచర సీనియర్ న్యాయమూర్తుల నుండి కూడా `క్లీన్ చిట్’ పొందిన తర్వాతనే ఈ సిఫార్సు చేసిన్నట్లు తెలుస్తున్నది. ఈ  ఆరోపణలను గతంలోని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసి ఉండడంతో, సుదీర్ఘకాలం అనుసరిస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి అందరికన్నా సీనియర్ ను న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని మోదీ ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.

జమ్మూ-కశ్మీరులో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను తక్షణమే సమీక్షించాలని రూలింగ్ ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ రమణ కూడా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి పదవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పిన జడ్జీల ప్యానెల్‌లో కూడా ఆయన ఉన్నారు. సీజేఐగా తొలిసారి బాధ్యతలు నిర్వహించిన తెలుగు తేజం జస్టిస్ కోకా సుబ్బారావు. ఆయన 1966-1967 మధ్య కాలంలో సీజేఐగా వ్యవహరించారు. అంతకుముందు ఆయన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.

ఇలా ఉండగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

సుప్రీంకోర్టు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, అమరావతి భూముల విషయంలో జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్-హౌస్ ప్రొసీజర్‌లో విచారణ జరిపి, తగిన విధంగా పరిశీలించి, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనది, ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదు. ఈ ఆరోపణలను అఫిడవిట్ ద్వారా కూడా జగన్ సుప్రీంకోర్టుకు సమర్పించారు.