గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుపై విజయన్‌ నోరు మెదపాలి 

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గోల్డ్‌, డాలర్‌ స్మగ్లింగ్‌ కేసుపై నోరు మెదపాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి కేరళ ప్రజలకు సీఎం విజయన్‌ సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. 

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్‌ను విజయన్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఈడీ అధికారులు ఒత్తిడి చేశారంటూ కేరళ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం రాజకీయ స్టంట్‌గా ఆయన అభివర్ణించారు. ఈ కేసులో వాస్తవాలేంటో అందరికీ తెలుసునని ఓ జాతీయ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ అమిత్‌ షా పేర్కొన్నారు.

ఈ స్కామ్‌లో సీఎం ప్రమేయం లేకుంటే ముఖ్య కార్యదర్శిని ఎందుకు తొలగించారని అమిత్ షా ప్రశ్నించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాషాయ పార్టీని నిరుత్సాహపరుస్తాయని విజయన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా కనుమరుగవుతున్నారని ఎద్దేవా చేశారు. 

కేరళ ప్రజలు ఎల్డీఫ్‌, యూడీఎఫ్‌ల పాలనతో విసిగిపోయారని  కంజిరాప‌ల్లిలో   జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ అమిత్‌ షా పేర్కొన్నారు. బీజేపీని ప్రత్యామ్నాయంగా ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో తాము మెరుగైన ఫలితాలు రాబడతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రెండు కూటములు క‌లిసి కేర‌ళ‌ రాష్ట్రాన్ని అవినీతికి కేంద్ర బిందువుగా మార్చాయ‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఒక తికమక పార్టీ అని, ఆ పార్టీ నాయకత్వం కూడా తికమక నాయ‌క‌త్వ‌మేన‌ని షా ఎద్దేవా చేశారు. కేరళ ఇటీవ‌ల‌ రెండు తుపాన్‌ల‌ను చవిచూసిందని, ఆ తుఫాన్‌లవ‌ల్ల 500 మంది నిరాశ్రయులయ్యారని ఆయ‌న చెప్పారు. తుపాన్‌ల స‌మ‌యంలో పిన‌ర‌యి విజ‌య‌న్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్మీని ఆలస్యంగా రంగంలోకి దించిందని అమిత్ షా ఆరోపించారు.

పిన‌ర‌యి స‌ర్కారుకు రాజకీయ ప్రయోజనాలే త‌ప్ప ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టవని ఆయ‌న ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సార‌థ్యంలోని యూడీఎఫ్ హ‌యాంలో సోలార్ స్కామ్ జరిగిందని, లెఫ్ట్ పార్టీల సార‌థ్యంలోని ఎల్డీఎఫ్ హ‌యాంలో బంగారం స్కామ్ జరిగిందని అమిత్‌షా ఎద్దేవా చేశారు.