మమతను సాగనంపితేనే బెంగాల్‌లో నిజమైన మార్పు

దీదీని (ముఖ్యమంత్రి మమతా బెనర్జీ), టీఎంసీని సాగనంపితేనే బెంగాల్ ప్రజలు కోరుకుంటున్న నిజమైన మార్పు మే 2న సాకారమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడుతూ, మేదినీపూర్ జిల్లా ప్రజలతో మమతా బెనర్జీ ఆడిన ‘బ్లేమ్ గేమ్’కు మే 2న నందిగ్రామ్ ప్రజలు సరైన సమాధానం ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు. 
 
బెంగాల్‌కు ఎవరు వచ్చినా బయట వ్యక్తులంటూ మమత ఆడిపోసుకుంటున్నారని, భారతీయుల మధ్య విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారని మమతపై విమర్శలు గుప్పించారు. `మనం బయట వాళ్లం కాదు. అందరూ భారతీయులమే. మనమంతా గురుదేవ్ రబీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన పాడుతుంటాం’ అని మోదీ పేర్కొన్నారు.
రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సుభాష్‌ చంద్ర బోస్‌, బంకించంద్ర ఛటర్జీ వంటి దిగ్గజాలు పుట్టిన బెంగాల్‌లో భారతీయులెవరూ బయటివారు కాదని పేర్కొన్నారు. వందేమాతరం నినాదంతో దేశ ప్రజలను ఏకం చేసిన ఈ గడ్డపై మమతా దీదీ బయటివారు అంటూ తమను ఎద్దేవా చేస్తున్నారని ఇక్కడ ఏ ఒక్క భారతీయుడూ బయటివారు కాదని అందరం భరతమాత బిడ్డలమేనని స్పష్టం చేశారు.
బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి ఈ గడ్డకు చెందిన వారే ఉంటారని ప్రధాని హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌లో నిజమైన మార్పు తీసుకురావడానికి, సోనార్ బంగ్లా దిశగా సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు ఇదే తగిన తరుణమని ఆయన సూచించారు.  మే 2న (ఎన్నికల ఫలితాలు ప్రకటించే రోజు) దీదీకి ఉద్వాసన పలికితే, అసోంలో నిజమైన మార్పు వస్తుందని పేర్కొన్నారు. దీదీ ‘ఆటలు’ బెంగాల్ ప్రజలు అర్ధం చేసుకున్నారని, దీదీ ఆట ముగిసిందని, బీజేపీ వికాసం మొదలైందని చెప్పారు.