మావోయిస్టుల దాడిలో ఐదుగురు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం రక్తసిక్తమైంది. మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు ఐదుగురు జవాన్లు బలికాగా, మరో 13మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం నారాయణ్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకున్నది. 

నారాయణ్‌పూర్‌ జిల్లా ఎస్పీ మోహిత్‌ గర్గ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లాలో నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన జిల్లా రిజర్వ్‌ గార్డు (డీఆర్‌జీ) బలగాలు మంగళవారం బస్సులో పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వెనుదిరిగాయి. 

ఈ క్రమంలో చప్టా వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతర మీదుగా జవాన్ల బస్సు వెళ్లింది. దీంతో భారీ విస్పోటనం జరుగడంతో బస్సు.. సుమారు 5 మీటర్ల ఎత్తుకెగిరి కల్వర్టు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. 

మరో 13 మంది క్షతగాత్రులను హెలికాఫ్టర్‌ ద్వారా రాయ్‌పూర్‌ దవాఖానకు తరలించారు. మృతిచెందిన వారిలో హెడ్‌కానిస్టేబుల్‌ జయ్‌లాల్‌ ఊడే, పవన్‌ మాండవి, కరహ్‌ దేహారి, సలామ్‌, విజయ్‌ పటేల్‌ ఉన్నట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. 

ఘర్షణల నివారణకు సంధి కోసం వారం క్రితం రాయబారం పంపిన మావోయిస్టులు.. జవాన్లపై దాడి చేయడం ఆందోళన కలిగిస్తున్నదని ఓ అధికారి తెలిపారు.