ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్

ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాజా పీఆర్సీతో 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని, కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా పీఆర్సీ ఆలస్యం అయ్యిందని పేర్కొన్నారు.
అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి పెంచుతున్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అన్ని విభాగాల ఉద్యోగుల అందరికీ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని ఆయన తెలిపారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. 
 
ప్రతి ఐదేళ్ల ప్రకారం పీఆర్సీ పెంచామని చెబుతూ ఇప్పటి వరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని వెల్లడించాయిరు. వెంటనే అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయని తెలిపారు. పెన్షనర్లు వయోపరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. 
 
కాగా, బీజేపీ ఆందోళన కారణంగానే సీఎం కేేసీఆర్ పీఆర్సీ ప్రకటించారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం పీఆర్సీ పెంపు వేతనం కేవలం 12నెలలు ఇస్తామనడం మోసం చేసినట్లేనని ధ్వజమెత్తారు. బీజేపీ ఆందోళనలు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం బీజేపీ వైపు నిలబడటంతోనే పీఆర్సీ ప్రకటించారని చెప్పారు. 
 
ఉద్యోగ, ఉపాధ్యాయులకు కనీసం 44శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ కోసం బీజేపీ కార్యకర్తలు ఆందోళనలతో పాటు.. రక్తం చిందించారు, జైలు పాలయ్యారని తెలిపారు.బీజీపీ ఒత్తిడితోనే పీఆర్సీ అనివార్యమైంది.. 43శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ వస్తుందని ఆశించిన ఉద్యోగులు నిరాశకు చెందారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.