ఎమ్మెల్సీగా పల్లా తిరిగి ఎన్నిక 

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు. శనివారం రాత్రి జరిగిన లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా  వరుసగా రెండోసారి విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించిన పల్లా ఎలిమినేషన్‌ రౌండ్స్‌లో లెక్కించిన తదుపరి ప్రాధాన్యత ఓట్లలోనూ అదే ఊపును కొనసాగించారు. 
 
ఫైనల్‌గా సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌పై విజయం సాధించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,61,811 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపులో ఆది నుంచి మూడో స్థానంలో కొనసాగిన కోదండరామ్‌ చివరకు ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో కోదండరామ్‌కు వచ్చిన ప్రథమ ప్రాధాన్యత బ్యాలెట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా అత్యధిక ఓట్లు పల్లాకు లభించాయి. 
 
తొలి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొత్తం 1,10,840 ఓట్లు వచ్చాయి. తీన్మార్‌ మల్లన్న 83,290 ఓట్లతో ద్వితీయ స్థానంలో, కోదండరామ్‌ 70,072 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌, సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డి, చెరుకు సుధాకర్‌, రాణీరుద్రమరెడ్డి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
 
తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ ఇన్ని ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్‌ పద్ధతిలో తదుపరి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తొలి ప్రాధాన్యతలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరుగా ఎలిమినేట్‌ చేస్తూ వారి బ్యాలెట్లలో ఉన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఎవరికి వస్తే వారికి పంచుతూ వచ్చారు. మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 69 మంది ఎలిమినేట్‌ అయ్యారు.