మోదీకి వ్యతిరేకించడం ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడమే!

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటమంటే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడంతో సమానమని బీజేపీ నేత సువేందు అధికారి స్పష్టం చేశారు. మోదీ ఎన్నికైన ప్రధాని అయినందున కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రజలు తీసుకోవాలని పేర్కొన్నారు. 
 
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థిగా సువేందు పోటీ చేస్తున్నారు. జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పీఎం మోదీ వ్యాక్సిన్‌ను ప్రజలు తీసుకోవాలని, ఆయన ప్రజలు ఎన్నుకున్న ప్రధాని అని పేర్కొన్నారు. 
 
ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడటమంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, భరతమాతకు వ్యతిరేకంగా మాట్లాడటంతో సమానమని తెలిపారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు వ్యాక్సిన్లు లేవని, అందువల్ల మీరు మోదీ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
 
జనవరి ద్వితీయార్థంలో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైనప్పటికీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయంటూ తృణమూల్ కాంగ్రెస్ విమర్శించిన నేపథ్యంలో సువేందు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
దీనికి ముందు, మమతాబెనర్జీని ‘రిగ్గింగ్ క్వీన్’ అంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడుకూడా ఆమె అధికార యంత్రాగ్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, చొరబాటుదారులను, పాకిస్థానీయులను ప్రోత్సహిస్తున్నా పోలీసులు మౌన ప్రేక్షకులుగా చూస్తూ మిన్నకుంటున్నారని సువేందు ఆరోపించారు. 
 
ఉద్రిక్తలు రెచ్చగొడుతున్న వారు టీఎంసీ కార్యకర్తలు కాదని, పాకిస్థానీయులని, ఆ విధంగా చేయడం వారికి కొత్త కూడా కాదని సువేందు ఆరోపించారు. అలాంటి పాకిస్థానీయులపై భారతీయతే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.