
దేశంలో అనుమతిచ్చిన రెండు కరోనా వ్యాక్సిన్లపై (కొవాగ్జిన్, కొవిషీల్డ్) అపోహలు అక్కర్లేదని, ప్రజలు నిస్సంకోచంగా టీకా వేసుకోవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.5-4 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారని, దుష్ప్రభావాలు కేవలం 0.000432 శాతం మందిలో మాత్రమే కనిపించాయని చెప్పారు.
దేశంలో ప్రతి ఒక్కరికీ టీకా వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కరోనా ఉత్పరివర్తనాలపై కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నదని, టీకా కాంపోజిషన్ మార్చాల్సిన అవసరం లేదని కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ చౌబే స్పష్టంచేశారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అనుమతిచ్చిన ప్రైవేట్ దవాఖానలతోపాటు మరిన్ని ప్రైవేట్ దవాఖానలకు అనుమతివ్వాలని తెలంగాణతోపాటు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తులకు ఆమోదం తెలిపినట్టు కేంద్రం వెల్లడించింది.
0-14 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలపై కరోనా ప్రభావం తక్కువేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయని హర్షవర్ధన్ తెలిపారు. వారిపై వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ అవసరం లేదని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కాగా, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా రాష్ర్టాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని మొత్తం కేసుల్లో ఈ రాష్ట్రాలు వాటానే 80 శాతానికిపైగా ఉన్నట్టు తెలిపింది. 65% పైగా కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.
గత 9 వారాలుగా ఇప్పటివరకూ దేశంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు కరోనా టీకా వేశారు. గడచిన 24 గంటల్లో 22 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. వీరిలో ఒక కోటికన్నా ఎక్కువమంది రెండవ డోసు టీకా కూడా తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
మార్చి 19 నాటికి అంటే 63వ రోజు నాటికి నాలుగు కోట్ల మందికిపైగా ప్రజలకు టీకా వేశారు. వీరిలో కోటిమందికి గడచిన ఐదు రోజుల్లో టీకా వేశారు. 65 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు తొలిడోసు, 81 వేల మంది రెండవ డోసు టీకా తీసుకున్నారు. దేశంలో ఇప్పటివరకూ 1.41 కోట్లకు పైగా వృద్ధులకు కరోనా టీకాలు వేశారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే