‌ సీజనల్‌ వ్యాధిగా కరోనా మహమ్మారి  

  కరోనా వైరైస్‌ సీజనల్‌ వ్యాధిగా వస్తుందని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) హెచ్చరించింది. వాతావరణం మారిందని కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన నిబంధనలకు సడలింపులు ఇవ్వవద్దని ప్రపంచ దేశాలకు సూచించింది.
కొవిడ్‌ వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై యూఎన్‌ నిపుణులు చేసిన అధ్యయనం నివేదికల మేరకు ఈ హెచ్చరికలు చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సంస్థకు చెందిన 16 మంది సభ్యుల బృందం అధ్యయనం మేరకు శ్వాసకోశ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు సీజనల్‌గా మారుతాయి.
శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా ఎక్కువగా ఉంటుంది. సమశీతోష్ణ వాతావరణం ఉండే ప్రాంతాల్లో జలుబు కలిగించే ఈ వైరస్‌ వ్యాప్తి ఉంటుంది. ఇలాగే కొన్నేండ్లపాటు కొనసాగితే ఈ మహమ్మారి సీజనల్‌ వ్యాధిగా  మారుతుందని నిపుణులు పేర్కొన్నారు.
భారతదేశంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనట్లుగా కనిపిస్తున్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ తిరిగి అమలుచేస్తున్నారు. పలు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించి కరోనాను నిరోధిస్తున్నారు.
మాస్కులు ధరించడం, నిర్ణీత భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలతో కరోనావ్యాప్తిని దాదాపుగా కట్టడి చేయవచ్చు. కొన్ని వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కొవిడ్‌ వ్యాపించిందని, వచ్చేఏడాది కూడా ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పడానికి ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు.
వాతావరణ మార్పులు, గాలి నాణ్యత వైరస్‌ వ్యాప్తిపై ఏమేరకు ప్రభావం చూపుతున్నదనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నదని ఐక్యరాజ్యసమితి చెప్తున్నది.