స్వేచ్ఛగా ఉండే దేశాలకు చైనా ముప్పే

డ్రాగన్ కంట్రీ చైనాపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకే పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. ‘మనలాంటి స్వేచ్ఛ కలిగిన సమాజానికి చైనా చాలా గొప్ప ముప్పు’ అని స్పష్టం చేశారు. 
 
అయితే తమ విలువలు, అభిప్రాయాలూ కలిసినంతకాలం చైనాతో కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఆయన స్పష్టంచేశారు. దీనిలో భాగంగా బలమైన, సానుకూలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం కోసం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. 
 
అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదేనని ఆయన హామీ ఇచ్చారు. దుష్ఫలితాలు వస్తున్నాయన్న కారణంగా 20పైగా దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. 
 
కాగా, బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ నెలాఖరులో భారత్‌లో పర్యటించనున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి యూకే బయటకు వచ్చిన తర్వాత ఆయన తొలి ప్రధాన అంతర్జాతీయ పర్యటన ఇదేనని డౌనింగ్‌ స్ట్రీట్‌ (బ్రిటన్‌ ప్రధానమంత్రి కార్యాలయం) ప్రకటించింది. పర్యటనలో భాగంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని అవకాశాలను మెరుగుపరుచుకోవాలని బ్రిటన్‌ భావిస్తున్నది. ఇండియా-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా వెళ్లాలని యోచిస్తున్నది.