బెంగాల్ లో బీజేపీ దూసుకెళ్తుంది 

క్రికెట్ మైదానంలో సౌరవ్ గంగూలీ సిక్సర్లు బాదినట్లు పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

‘‘సౌరవ్ గంగూలీ క్రీజు దాటాడంటే కచ్చితంగా సిక్స్ కొట్టడం ఖాయం. అదేవిధంగా, లోక్‌సభలో మీ మద్దతుతో మేం క్రీజు దాటాం, శాసన సభ ఎన్నికల్లో మేం కచ్చితంగా సిక్స్ కొడతాం, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో  ప్రజలు మార్పు కోరుతూ ఎలా తీర్పునిచ్చారో అలాంటి తీర్పే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కానుందని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందా? అని విలేకర్లు అడిగినపుడు రాజ్‌నాథ్ మాట్లాడుతూ, తమది ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అని తెలిపారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకుంటారని చెప్పారు.

బెంగాల్‌లో గెలుపుపై నైరాశ్యంలో ఉన్నందు వల్లే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని  మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. తన కాలికి తగిలిన గాయంపై మమత ఒక్కరే బీజేపీపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. భద్రతా లోపాల వల్లే మమతకు గాయమైనట్టు దర్యాప్తు సంస్థలు, పరిశీలకులు సైతం తమ నివేదికల్లో పేర్కొన్నట్టు చెప్పారు. త్వరలోనే ఆమె కోలుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ప్రధాని మోదీ దేశాన్ని సరిగా నడిపించలేకపోతున్నారంటూ మమతా బెనర్జీ చేసిన విమర్శలను రాజ్‌నాథ్ తిప్పికొట్టారు. ఆమె ఆరోపణల్లో పస లేదని అంటూ  2014 నుంచి ఇప్పటి వరకూ మోదీ నాయకత్వంలోనే ప్రభుత్వం నడుస్తోందని గుర్తు చేశారు. ప్రజల మద్దతు ఉండటం వల్లే రెండోసారి కూడా అంతకంటే ఎక్కువ సీట్లతో బీజేపీ గెలిచిందని తెలిపారు. 

ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించలేకపోతే 2019లో సొంతంగా మెజారిటీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్, వామపక్షాలు తమ ప్రాధాన్యతను కోల్పోయాయని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.