అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9 రోజులే 

సాధారణంగా నెలరోజులపాటు జరిగే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ సారి 9 రోజులు, కౌన్సిల్ సమావేశాలు 5 రోజుల పాటు మాత్రమే  జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. 

గురువారం అసెంబ్లీ, కౌన్సిల్లో 2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 20, 22 తేదీల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ పై  సాధారణ చర్చ తర్వాత ప్రభుత్వం సమాధానం చెప్పనుంది. తర్వాత మూడు రోజుల పాటు పద్దులపై చర్చించి ఆమోదం పొందనున్నారు. 26న అప్రాప్రియేషన్ బిల్లు తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడనుంది.

బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. సీఎం కేసీఆర్ సమాధానం తర్వాత సభను తర్వాత రోజుకు వాయిదా వేస్తారు. 18న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. 20వ తేదీ నుంచి అసెంబ్లీలో క్వశ్చన్, జీరో హవర్ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్పై చర్చ ప్రారంభిస్తారు. ఆ చర్చకు 21న ఆర్థిక మంత్రి సమాధానమిస్తారు. 22 నుంచి 25 వరకు డిపార్ట్మెంట్ల వారీగా పద్దులను సభలో ప్రవేశపెట్టి చర్చిస్తారు. 26న అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టి దానికి ఆమోదం తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. 

మండలిలో 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. 18న బడ్జెట్ ప్రవేశపెడతారు. 20న బడ్జెట్పై చర్చ. 22న బడ్జెట్పై చర్చకు ప్రభుత్వం సమాధానం చెబుతుంది.  26న అప్రాప్రియేషన్ బిల్లును సభలో ప్రవేశ పెడుతారు. ఆమోదం పొందిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. మండలిలో 20, 22, 26 తేదీల్లో క్వశ్చన్ హవర్, జీరో హవర్ నిర్వహించాలని నిర్ణయించారు.