ప్రత్యక్ష నగదు బదిలీతో రైతులకు నేరుగా ఎంఎస్‌పి 

తుషార్ జి

పంజాబ్‌లో కొనసాగుతున్న రైతుల నిరసనలు, వరి సేకరణకు పెరుగుతున్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) మధ్య, నరేంద్ర మోదీ ప్రభుత్వం రాబోయే రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్‌ఎంఎస్) కోసం ఎంఎస్‌పికి ప్రత్యక్ష ఆన్‌లైన్ చెల్లింపును ప్రకటించడం ద్వారా మాస్టర్‌స్ట్రోక్ ఆడింది.

ఈ నెల ప్రారంభంలో, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) పంజాబ్ కార్యాలయం ఆహార, పౌర సామాగ్రి, వినియోగదారుల వ్యవహారాల డైరెక్టర్‌కు ఆ మేరకు లేఖ రాసింది. వచ్చే సేకరణ కాలానికి ఎంఎస్‌పిల ప్రత్యక్ష బ్యాంకు బదిలీని నిర్ధారించడానికి రైతుల భూ రికార్డులను అభ్యర్థించింది. గోధుమల సేకరణకు భూమి రికార్డులు తప్పనిసరి చేశారు. ఆర్ఎంఎస్ 2021-22 ప్రారంభానికి ముందు ఆ రికార్డు లను నవీకరించబడాలి.

ఆర్‌ఎంఎస్ 2021-22 సమయంలో రైతుల భూముల రికార్డులను వారి కొనుగోళ్లకు సంబంధించి ధృవీకరించాలని కార్పొరేషన్‌ను ఎఫ్‌సిఐ రాసిన లేఖ సూచించింది. కొన్ని పంటలు తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ, ప్రధానంగా గోధుమలు, వరితో పాటు పంటల ఎంఎస్‌పి సేకరణ విషయానికి వస్తే పంజాబ్ ఒక ముఖ్యమైన రాష్ట్రం.

2017-18లో, ఉత్పత్తి చేసిన వరి పంటలో 90 శాతం, గోధుమ పంటలో 66.4 శాతం సేకరించారు. జాతీయ గోధుమలు, వరి ఉత్పత్తిలో పంజాబ్ వాటా వరుసగా 18 శాతం, 12 శాతం. కానీ ఆ సంవత్సరం సెంట్రల్ పూల్ లో పంజాబ్ గోధుమ వాటా 38 శాతం, బియ్యం వాటా 31 శాతం. పంజాబ్ కు గణనీయమైన వాటా ఎఫ్ సి ఐ సేకరణలో ప్రతిబింబిస్తుంది

ఎఫ్‌సిఐ సేకరించిన 40.37 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎమ్‌టి) గోధుమలలో ఆర్‌ఎంఎస్ 2019-20లో 15.72 ఎల్‌ఎమ్‌టి పంజాబ్ నుంచి వచ్చింది. సేకరించిన 7.52 ఎల్‌ఎమ్‌టి వరిలో 2019-20 నాటి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) కోసం, 2.24 ఎల్‌ఎమ్‌టి వచ్చింది. ఎఫ్‌సిఐ సేకరించిన 6.03 ఎల్‌ఎమ్‌టి వరిలో కెఎంఎస్ 2020-21లో 2.69 ఎల్‌ఎమ్‌టి పంజాబ్ నుంచి వచ్చింది. అయితే, ఈ సంఖ్యలలో రాష్ట్ర సంస్థల సేకరణ జరగడం లేదు.

ఆసక్తికరంగా, రైతులకు ప్రత్యక్ష ఎంఎస్‌పి బదిలీలు జరిగేలా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. 2012 లో కూడా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని విస్మరించి, అప్పటి శిరోమణి అకాలీదళ్-భారతీయ జనతా పార్టీ  ప్రభుత్వం రైతుల కోసం  ఎంఎస్‌పి  పై  కమిషన్ ఏజెంట్లు,  మధ్యవర్తుల ద్వారా లేదా ఆర్తియా ద్వారా కొనసాగించారు.

ప్రత్యక్ష నగదు బదిలీలను సులభతరం చేసే యంత్రాలు అందుబాటులో లేవని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తనను తాను సర్దిచెప్పుకొంది. 1.2 మిలియన్లకు పైగా రైతు కుటుంబాలకు బదులుగా 20,000 మేరకు మధ్యవర్తులతో వ్యవహరించడం సులభం అని పేర్కొంది.

2012 లో రైతులకు నేరుగా నగదు చెల్లించే అవకాశాన్ని కూడా ఎఫ్‌సిఐ కోరింది. పంజాబ్ రైతుల కోసం భూ రికార్డులపై ఇటీవల ఎఫ్‌సిఐ చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా, పంజాబ్ అర్తియా అసోసియేషన్ సమ్మెను బెదిరించి, నిరసగా ఏప్రిల్, 2021 నుండి గోధుమల సేకరణను నిలిపివేస్తామని హెచ్చరించింది.

మోదీ  ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా ఈ మాస్టర్‌స్ట్రోక్ నిర్ణయం తీసుకోవడం మూడు ప్రధాన సమస్యలను పరిష్కరిస్తుంది.  ఒకటి, రైతులు తమ పంటను ఎఫ్‌సిఐకి విక్రయించడంతో  భవిష్యత్తులో, రాష్ట్ర సంస్థలకు కూడా, పూర్తి చెల్లింపును డిజిటల్‌గా తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆశిస్తారు.

రెండు,  ఎఫ్‌సిఐ ఇప్పటికే ఎంఎస్‌పి-లింక్డ్ ఫీజుకు బదులుగా ఇటీవలి కెఎంఎస్‌లో మధ్యవర్తుల కోసం నిర్ణీత రుసుముతో ప్రయోగాలు చేసింది. ఎంఎస్‌పి పెరుగుదల మధ్యవర్తుల కమిషన్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నందున, ఎఫ్‌సిఐ తన సేకరణ ఖర్చులను తగ్గించడంలో స్థిర రుసుము సహాయపడుతుంది.

మూడు, ఇది మధ్యవర్తుల బారి నుండి రైతులను కాపాడుతుంది. పంజాబ్ లో సాంప్రదాయకంగా, మధ్యవర్తులు లేదా అర్తియా, మండిస్ వద్ద రైతులు, ఏజెన్సీల మధ్య వాణిజ్యాన్ని సులభతరం కావిస్తుంది.

ఏదేమైనా, ఎపిఎంసి వ్యవస్థ ప్రకారం, పంజాబ్లో చెల్లింపు ఇప్పటికీ రైతులకు నేరుగా కాకుండా మధ్యవర్తులకే వెళుతుంది, చెల్లింపులో తమ కమీషన్ను అందుకున్న తర్వాతనే మధ్యవర్తులు  ఆపై రైతులకు చెల్లింపులు చేస్తారు.

అయితే, ఇక్కడ సమస్య ఏమిటంటే రైతులు మొత్తం ఎంఎస్‌పిని పొందుతున్నారని నిర్ధారించడానికి ప్రభుత్వానికి మార్గం లేదు.  అనధికారిక క్రెడిట్ కోసం మధ్యవర్తులపై ఆధారపడిన రైతుల కోసం, మధ్యవర్తులు ఇచ్చిన రుణంపై వడ్డీని తీసివేసిన తరువాత రైతులకు చెల్లింపు జరుగుతుంది.

తరచుగా, ఈ అనధికారిక రుణాలపై వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రైతుల ఆదాయంలో సింహభాగం కైవసం చేసుకొని, రుణ చక్రాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. వ్యవసాయంలో పడిపోతున్న ఆదాయాలు, పెరిగిన జీవన వ్యయాలు కారణంగా రైతులు రుణాలను తిరిగి చెల్లించలేక పోతున్నారు. .

అధ్వాన్నమైన అంశం ఏమిటంటే  తిరిగి చెల్లించే షెడ్యూల్ అందుబాటులో ఉన్న బ్యాంకుల మాదిరిగా పారదర్శకంగా మొత్తం చెల్లింపు ప్రక్రియ మధ్యవర్తుల అభీష్టానుసారం జరుగుతూ ఉంటుంది. అందువల్ల, చాలా సందర్భాల్లో, రైతులు మధ్యవర్తులకు తామెంత రుణపడి ఉంటామో కూడా గ్రహించలేని పరిస్థితులు నెలకొంటాయి. తిరిగి చెల్లించడంలో విఫలమైన వారు తమ భూములను కోల్పోతారు.  కొన్ని సందర్భాల్లో ఇది చాలా మంది ఆత్మహత్యలకు నెట్టివేస్తుంది.

  ఎంఎస్‌పి మొత్తాన్ని ప్రత్యక్ష నగదు చెల్లింపు ద్వారా రైతులకు నేరుగా చెల్లించడం రైతులు తమ ఉత్పత్తుల నికర విలువను గ్రహించడానికి సహాయ పడుతుంది. అనధికారిక క్రెడిట్ కోసం మధ్యవర్తులతో వారు నిమగ్నం కావాలనుకున్నా, వడ్డీ చెల్లింపు తర్వాత జరగవచ్చు.ఇది భవిష్యత్తులో రైతులకు అధికారిక రుణానికి అవకాశాలను కూడా తెరుస్తుంది.

ప్రత్యక్ష నగదు బదిలీ బ్యాంకులు రైతు విశ్వసనీయతను అంచనా వేయడానికి సహాయపడుతుంది. తద్వారా తరువాతి బహుళ ఆర్థిక సేవలను అందించడానికి వీలు కల్పిస్తుంది. ఇది తక్కువ వడ్డీ రేటుతో అనేక సేవలకు రుణాలు పొందటానికి రైతులకు సహాయపడుతుంది.

చివరగా, ఇది మధ్యవర్తుల వేధింపులకు ముగింపు పలుకుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మధ్యవర్తుల పాత్ర అంతం కాకపోయినప్పటికీ, వారు అందించిన సేవలకు మాత్రమే వారికి తగిన మొత్తాల చెల్లింపు జరుగుతుంది. రుణాలు ఇచ్చేటప్పుడు వారు ఇకపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి వీలు ఏర్పడదు.

భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ప్రైవేట్ మాండీస్ తెరవడం ద్వారా రైతులకు తమ ఉత్పత్తులకు అమ్ముకొనే అవకాశాలను విస్తృతం చేయడంలో సహాయపడుతుంది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి పేర్కొన్నప్పటికీ, ఇది మధ్యవర్తుల రాజకీయ పలుకుబడిని మాత్రమే ప్రతిబింబిస్తుంది.

వీరిలో ఎక్కువ మంది రైతులు కూడా కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా ఎస్ఎడి తరపున పనిచేస్తారు. వ్యవసాయ చట్టాల ప్రకారం, విలువ కల్పించడంలో మరెవ్వరికన్నా రైతుల ప్రయోజనాలను ముందుంచడంపై ఈ చర్య దోహదపడుతుంది. దళారీలకు ఇదొక్క హెచ్చరిక వంటిది కాగలదు. తాము పారదర్శకంగా వ్యవహరించని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని స్పష్టం చేస్తుంది.