రవిప్రకాశ్‌ కు సుప్రీం కోర్టులో ఊరట 

టివి 9 మాజీ సిఇఒ రవిప్రకాశ్‌ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఈడి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
 
రవిప్రకాశ్‌, మరో ఇద్దరు, టివి 9 మాతృ సంస్థ అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతులు లేకుండా ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
2019 అక్టోబర్‌లో దీనిపై కేసు నమోదైంది. దాని ఆధారంగా ఈడి వర్గాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసిఐఆర్‌) నమోదు చేశాయి. ఈ కేసులో రవిప్రకాశ్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్‌ మంజూరయింది. 
 
ఈ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఈడి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు నిరాకరించింది. బెయిల్‌ షరతులను రవి ప్రకాశ్‌ ఉల్లంఘించారా అని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అన్నీ పరిశీలించిన తర్వాతే ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందని ధర్మాసనం పేర్కొంది. ఈడి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్టు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.