తెలంగాణలో టీఆర్‌ఎ్‌సకు బీజేపీయే ప్రత్యామ్నాయంగా మారిందని, 2023లో తమ పార్టీ అధికారంలోకి రావడం, కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుర్ భరోసా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణపతి ప్రాంగణం వద్ద ‘గడీల బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం ఉద్యమ గళాల గర్జన పేరిట’ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వారి బాక్సులు బద్దలయ్యేలా తీర్పు ఇవ్వాలని కోరారు. భైంసాలో 12 హిందువుల ఇళ్లను ఓ వర్గం వారు కూల్చినా కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజ్యాంగబద్ధ పదవిని చెప్పుతో పోల్చిన కేసీఆర్‌కు ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు.
‘‘రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. టీఆర్‌ఎస్ వారు ఓట్లు అడగకుండా బెదిరిస్తున్నారు. గులాబీ పార్టీ నేతలు ఓటుకు రూ.1000తో పాటు రవాణా ఖర్చులు కూడా ఇస్తున్నారు. టీఆర్‌ఎస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది.అందుకే ఉద్యోగ సంఘాలకు కేసీఆర్ అపాయుంట్‌మెంట్లు ఇస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత కనబరుస్తూ మార్పు రావాలని కోరుకుంటున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆజంజాహి మిల్లులు, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ కంపెనీలను తెలంగాణ రాష్ట్రం వచ్చిన వంద రోజుల్లో తెరిపిస్తామని ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మంత్రి కేటీఆర్‌ను బీజేపీ నేత విజయశాంతి ప్రశ్నించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు రాష్ట్ర మంత్రులు, కాగా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నగదు, మద్యం పంచుతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు బీజేపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, చింతల రామచంద్రారెడ్డి, ఎస్.కుమార్, ప్రకాశ్‌రెడ్డి, రామారావు చెప్పారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారని వారు పేర్కొన్నారు.
More Stories
స్థానిక బిసి రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు
సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం