చైనా లక్ష్యంగా అణుశక్తితో దాడి చేసే ఆరు జలాంతర్గాములు 

చైనా ఎప్పుడైనా మనపై దాడికి దిగినట్లయితే అందుకు సిద్ధంగా ఉండేందుకు భారత్‌ ప్రణాళికలు రచించింది. అణుశక్తితో దాడి చేసే ఆరు జలాంతర్గాములను నిర్మించాలనే ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది చివర్లో రెండవ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఆరంభించే వరకు, నేవీ మొత్తం సామర్ధ్య నిర్మాణ ప్రణాళికల్లో భాగంగా సోమవారం ముఖ్యమైన పరీక్షలు పూర్తయ్యాయి. 
 
మార్చి 8 న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ముంబైలో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) వ్యవస్థ యొక్క భూ ఆధారిత నమూనా తుది పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఏఐపీ వ్యవస్థను కల్వరి క్లాస్ జలాంతర్గాములలోకి తిరిగి అమర్చుతున్నారు. ఈ రకం జలాంతర్గాముల్లో మూడవదైన ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ మార్చి 10 బుధవారం ప్రారంభించారు. 
 
అణుశక్తితో పనిచేసే ఆరు జలాంతర్గాములను నిర్మించాలనే ప్రాజెక్టు ట్రాక్‌లోకి వచ్చింది. గుజరాత్‌లోని కెవాడియాలో గత ఏడాది చివర్లో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో రెండవ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించడం గురించి చర్చించారు. మొత్తమ్మీద చైనా నావికాదళాన్ని ఎదుర్కోవటానికి భారత నావికాదళం సమిష్టిగా ఈ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. 
 
ఇప్పుడు ఓడల సంఖ్య పరంగా అమెరికా నావికాదళం కంటే చైనా పెద్దదిగా తయారైంది. జలాంతర్గాములలో భారతదేశం ప్రస్తుతం రష్యా నుంచి లీజుకు తీసుకున్న ఒకే ఒక్క అకులా క్లాస్ ఎస్ఎస్ఎన్‌ను మాత్రమే కలిగి ఉండగా.. మరొకటి 2025 కు ముందు లీజుకు వచ్చే అవకాశమున్నది.
 
గాల్వన్‌ లోయలో మన సైనికులతో ఘర్షణకు దిగి దాదాపు 20 మంది చావుకు కారణమైన చైనా పట్ల కూడా కఠిన ధోరణితో ఉండాలని భారత్‌ నిశ్చయంతో ఉన్నది. ఇండో-చైనా సరిహద్దుల్లో కొత్త వ్యూహం ప్రారంభమైనందున.. చైనా రెండు తలల ఆటలు భారతదేశాన్ని రెచ్చగొట్టడం కొనసాగిస్తున్న తీరు మరోసారి బహిర్గతమైంది. 
 
పాంగోంగ్ సరస్సులో 928 డీ రకం దాడి పడవల్లో సైన్యాన్ని మోహరించింది. ఈ పడవలను చాంగ్జౌ ఎఫ్ఆర్డీ షిప్‌యార్డ్ తయారు చేసింది. ప్రతి పడవకు పది మంది సైనికులు, మందుగుండు సామగ్రి తీసుకువెళ్ళే సామర్థ్యం ఉన్నది. ఈ పడవలు ఇండియా-చైనా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) కు దగ్గరగా కనిపిస్తాయి.

చైనా విస్తరణవాద ఎత్తుగడల గురించి భారత జాతీయ భద్రతా ప్రణాళికదారులు ఆందోళన చెందుతున్నారు. 2023 నాటికి హిందూ మహాసముద్రంలో చైనా క్యారియర్ స్ట్రైక్ ఫోర్స్ మోహరింపు జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఈ ఏడాదే వారి మూడవ విమాన వాహక నౌకను ప్రారంభిస్తారని కూడా అనుకుంటున్నారు. భారత నావికాదళం తన సొంత సామర్థ్యాన్ని పెంపొందించే డ్రైవ్‌లోకి రావడానికి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

భారత్ తన రెండవ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, రెండవ అణుశక్తితో పనిచేసే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్) ఐఎన్ఎస్ అరిఘాట్‌ను ఈ ఏడాది కమిషన్ చేయనున్నది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇతర క్యారియర్ భారతదేశం యొక్క పశ్చిమ సముద్ర తీరంపై ఆధారపడి ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ తూర్పు సముద్ర తీరంలో ఉంటుంది. ప్రతి దానిలో ఒక ఎస్‌ఎస్‌బీఎన్‌, ఒక ఎస్‌ఎస్‌ఎన్‌ శక్తిని కలిగి ఉంటాయని నివేదికలు చెప్తున్నాయి.

కాగా, భారత నావికాదళం ప్రస్తుతం ఉన్న రెండు విమాన వాహక నౌకల కంటే ఎక్కువ టన్నుల సామర్థ్యం కలిగి ఉండే మూడవ విమాన వాహక నౌకను కోరుకుంటున్నది. విక్రమాదిత్య 45,000 టన్నులు, విక్రాంత్ 37,500 టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నది. మూడవ క్యారియర్ ఐఎన్ఎస్ విశాల్‌లో 65,000 టన్నుల సామర్థ్యం ఇవ్వడం గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి, 

అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని, కనీసం 15 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. అలాగే, ప్రస్తుతం మనం రెండు ప్రిడేటర్‌ డ్రోన్లను లీజ్‌పై తీసుకున్నాం. అలాకాకుండా, ఒక్కో సర్వీసుకు పది చొప్పున ప్రిడేటర్‌ డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత్‌ ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నది.