నందిగ్రామ్ ప్రజలు మమతను ఓడిస్తారు

నందిగ్రామ్ ప్రజలు మమతను ఓడిస్తారు

ప్రజలు బీజేపీకి మద్దతిచ్చి, తనను గెలిపిస్తారన్న నమ్మకం ఉందని నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి, మాజీ టిఎంసి మంత్రి సుబేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదని స్పష్టం చేశారు. 2019 లో బీజేపీ 18 పార్లమెంటరీ స్థానాలను కైవసం చేసుకుందని, ఈసారి అత్యంత భారీ మెజారిటీతో రాష్ట్రంలోనూ విజయం సాధిస్తామని ఆయన ప్రకటించారు. 

అయితే మమతకు జరిగిన గాయాలపై స్పందించడానికి నిరాకరించారు. ‘‘రాజకీయేతర ప్రశ్నలకు సమాధానం చెప్పను.’’ అని సేబేందు చెప్పారు.  నందిగ్రామ్ ప్రజలతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, సీఎం మమతకు మాత్రం ఎన్నికల సందర్భంలోనే నందిగ్రామ్ గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు.  మమతను నందిగ్రామ్ ప్రజలను ఓడిస్తారని సుబేందు జోస్యం చెప్పారు.  

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి పోటీ లేదని సువేందు అధికారి స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు లభిస్తాయనే నమ్మకం తనకు ఉందని, బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో నిజమైన అభివృద్ధిని ప్రజలు కాంక్షిస్తున్నారని చెప్పారు.

దీదీని 50,000 ఓట్ల తేడాతో ఓడిస్తానని లేనిపక్షంలో రాజకీయాల నుంచి వైదొలగుతానని సువేందు అధికారి సవాల్‌ విసరడంతో నందిగ్రామ్‌ పోరు ఉత్కంఠభరితంగా మారింది. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయన త‌న నామినేష‌న్ నేడు  దాఖ‌లు చేశారు.

కాగా, పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి ఆరోపణలపై బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ స్పందిస్తూ  మమతా బెనర్జీపై దాడి గొప్ప డ్రామా అని..కానీ అది రక్తి కట్టించలేదని ఎద్దేవా చేశారు. దీదీ గాయపడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉండే వ్యక్తిపై ఇలాంటి ఘటన ఎలా జరుగుతుందని దిలీప్‌ ఘోష్‌ ప్రశ్నించారు. బీజేపీని దెబ్బతీసేందుకే దాడి అంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ గాయపడ్డారనేదానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని చెప్పారు.