భారత్ సాధించిన ఘనతలన్నీ కేవలం మన దేశానికే కాదని, ఆ ఘనతలు యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్వయంసమృద్ధితో నిండిన మన దేశ ప్రయాణం ప్రపంచ దేశాల అభివృద్ధిని కూడా వేగవంతం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల గడుస్తున్న తరుణంలో ప్రత్యేక కార్యక్రమాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ స్వయంసమృద్ధి సాధించిందని, దీని వల్ల ప్రపంచ దేశాలకు కూడా ఉపయోగం జరిగిందని చెప్పారు.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. లోకమాణ్య తిలక్ పూర్ణ స్వరాజ్యం పిలుపును మరిచిపోలేమని గుర్తు చేసుకున్నారు. మంగళ్ పాండే, తాంతియా థోపే, రాణీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్ లాంటి వారు మనకు ప్రేరణగా నిలిచారని వివరించారు.
దేశ స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు యువత, విద్యావంతులు బాధ్యత తీసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మన దేశం సాధించిన ఘనతను ప్రపంచ దేశాలకు తెలియజేయాలని సూచించారు. కళలు, సాహిత్యం, నాటక రంగం, చిత్ర పరిశ్రమ, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు చెందిన వారు స్వాతంత్రోద్యమానికి చెందిన విశిష్టమైన కథలను విస్తృత ప్రచారం చేయాలని ప్రధాని కోరారు.
మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఫీలవాలని చెబుతూ ప్రజాస్వామ్య సాంప్రదాయాల పట్ల గర్వపడాలని చెప్పారు. ప్రజాస్వామ్యానికి ఇండియా తల్లి వంటిదని, ఆ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. దేశ వైభవోపత చరిత్రను సంరక్షించేందుకు గత ఆరేళ్ల నుంచి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రధాని వెల్లడించారు.
ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. మన దేశం వచ్చే సంవత్సరం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటుంది. 2022 ఆగస్టు 15 రావడానికి మరొక 75 వారాల సమయం ఉంది.
మహాత్మా గాంధీ దండి యాత్ర 91వ వార్షికోత్సవాల సందర్భంగా మార్చి 12న (శుక్రవారం) ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను మోదీ ప్రారంభించారు. ఈ ఉత్సవాలను 2023 ఆగస్టు 15 వరకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 75 కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అహ్మదాబాద్‌లో దండి యాత్రను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, ఆ తర్వాత సాధించిన విజయాలను ప్రపంచం ముందు ఉంచుతామని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామం గురించి స్పష్టంగా వివరించాలని అన్ని రంగాలవారినీ కోరారు. భారతీయులు స్వదేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా తమ కఠోర శ్రమతో తమను తాము నిరూపించుకున్నారని చెప్పారు.
భారత దేశ ఆత్మ విశ్వాసానికి గుర్తు ఉప్పు అని, మిగతా విలువలతోపాటు ఈ ఆత్మవిశ్వాసాన్ని కూడా బ్రిటిషర్లు దెబ్బతీశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారతీయులు ఇంగ్లండ్ నుంచి వచ్చే ఉప్పుపై ఆధారపడవలసి వచ్చేదని, ఆ సమయంలో మహాత్మా గాంధీ భారతీయుల పరిస్థితిని అర్థం చేసుకున్నారని చెప్పారు.
ప్రజల నాడిని తెలుసుకుని ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారని, ఆ ఉద్యమం ప్రతి భారతీయుడి ఉద్యమంగా మారిందని తెలిపారు. ప్రతి భారతీయుడు దృఢ నిశ్చయంతో ఉద్యమించాడని తెలిపారు.
More Stories
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత