మమతపై ఇప్పుడెలా దాడి జరిగిందో!

ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరగడం పట్ల కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ (ఏ) పార్టీ అధినేత రాందాస్ అథవాలె విస్మయం వ్యక్తం చేశారు. ఆమెపై గతంలో ఎప్పుడూ దాడి జరగలేదని, కానీ ఇప్పుడెలా జరిగిందో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 ఏమైనా కావొచ్చునని ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘మమత బెనర్జీపై దాడి జరగడం వెనుక ప్రణాళిక ఉందనే విషయం నాకు తెలియదు. కాకపోతే ఆమెపై జరిగిన దాడిపై విచారణ జరగాల్సిందే” అని స్పష్టం చేశారు. అయితే ఇందులో రాజకీయాలు ఎంత వరకు సమ్మిళితం అయి ఉన్నాయో తనకు తెలియదని చెప్పారు. మమత గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడికి గురవ్వలేదని ఆయన గుర్తు చేసారు. కానీ ఇప్పుడెలా చేయగలిరన్నదే ప్రశ్న అని పేర్కొన్నారు.

కాగా, మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే ఆమె ఎడమ కాలికి తగిలిన గాయం వల్ల తీవ్ర నొప్పితో బాధపడుతున్నారనీ.. రక్తంలో సోడియం స్థాయిలు కూడా తక్కువగా ఉన్నాయని తెలిపారు. 

బెనర్జీ ఆరోగ్య పరీక్షల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, చికిత్సకు స్పందిస్తున్నారని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రి మెడికల్ బులిటెన్ విడుదల చేసింది. ఎడమ కాలికి ఎక్స్‌రే తీసి చికిత్స అందిస్తున్నట్టు సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు.

 మరోవంక,మమతా బెనర్జీపై నందిగ్రామ్‌లో జరిగిన దాడి వెనుక లోతైన కుట్ర ఉందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారంనాడు ఈసీని కలిసి ఈమేరకు ఫిర్యాదు చేసింది.