ఉత్తరాఖండ్ సీఎంలను వెంటాడుతున్న అస్థిరత 

ప్రధాని వాజపేయి 2000లో కొత్తగా ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలలో ఒక్కటైనా ఉత్తరాఖండ్ ను తొలి నుండి రాజకీయ అస్థిరత వెంటాడుతున్నది. గత రెండు దశాబ్దాలలో కాంగ్రెస్ కు చెందిన ఎన్ డి తివారి తప్ప మరే ముఖ్యమంత్రి పూర్తిగా ఐదేళ్లు పదవిలో కొనసాగలేక పోయారు. తొమ్మిదవ ముఖ్యమంత్రిగా తీర‌త్ సింగ్ రావ‌త్ నేటి సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన 8 మందిలో ఐదుగురు బిజెపికి చెందిన వారు కాగా, ముగ్గురు కాంగ్రెస్ కు చెందినవారు. మంగళవారం రాజీనామా చేసిన  త్రివేంద్ర సింగ్ రావ‌త్ ఒక విధంగా తివారి తర్వాత ఎక్కువగకాలం సుమారు నాలుగేళ్లు అధికారంలో ఉండగలిగారు.
నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో 70 సీట్లలో 57 గెల్చుకున్న బిజెపి  త్రివేంద్ర సింగ్ రావ‌త్ ను ముఖ్యమంత్రిగా ఎంచుకున్నా ఆయన సహితం సుస్థిర పాలన ఇవ్వలేక పోయారు. మొత్తం అధికారాన్ని తన వద్దనే కేంద్రీకరించుకొంటూ, అధికారులపైననే ఆధార పడుతూ ఉండడంతో సొంతపార్టీకి చెందిన ఎమ్యెల్యేలలో సగం మందికి పైగా తిరగబడడంతో ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది.
45కు పైగా మంత్రిత్వ శాఖలను ఆయన తనవద్దనే ఉంచుకున్నారు. మంత్రివర్గ విస్తరణ జరుపకుండా కాలయాపన చేస్తూ ఉండడంతో సొంతపార్టీ నుండే అసహనంకు గురయ్యారు. పైగా, గత అక్టోబర్ లో ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలతో కూడిన ఒక కేసుపై విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం అస్థిరతకు గురవుతూ వచ్చింది.
కాగా, ఎన్నికల ముందు బిజెపి ముఖ్యమంత్రిని మార్చడం ఇది మూడవసారి. గతంలో రెండు సార్లు 4, 6 నెలల ముందు మార్చడంతో ప్రయోజనం లేకపోయింది. ఎన్నికలలో ఓటమి తప్పలేదు. కానీ ఇప్పుడు ఒక ఏడాది ముందే మార్చడంతో తిరిగి గెలుపొందాలని పక్క వ్యూహం రచించినట్లు కనబడుతున్నది.
2000లో కొత్త రాష్ట్రంగా ఏర్పడగానే ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన నిత్యానంద స్వామి తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అయితే ఒక సంవత్సరానికి 11 రోజల ముందుగానే రాజీనామా చేయవలసి వచ్చింది. 2002లో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ నేత, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ బి ఎస్ కోషియారీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అయితే ఆ ఎన్నికలలో బిజెపి ఓటమి చెందడంతో ఎన్ డి తివారి (కాంగ్రెస్) ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 35 సీట్లు గెల్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఆర్మీమేజర్  జనరల్ కేసి కోషియారీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. మాజీ సైనికాధికారిగా ఆయన రాజకీయ వ్యవహారాలు సరిగ్గా చేపట్టలేక పోయారని భావనతో 2 సంవత్సరాలు, 4 నెలల తర్వాత ఆయనతో రాజీనామా చేయింది ప్రస్తుత కేంద్ర హెచ్ ఆర్ డి మంత్రి రమేష్ పోకిరియల్ నిషాక్ ను ముఖ్యమంత్రిగా బిజెపి చేసింది.
పోఖ్రియాల్ అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిని కూడా దర్యాప్తు పరిధిలోకి తీసుకు వాస్తూ శక్తివంతమైన లోకాయుత్ ను నియమించారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే కృషి చేశారు. అయితే రెండేళ్లు, రెండు నెలల తర్వాత ఆయన కూడా రాజీనామా చేయవలసి వచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు ముఖ్యమంత్రిని మార్చి, తిరిగి ఖండూరీని ముఖ్యమంత్రిగా తీసుకు వచ్చినా 2012ఎన్నికలలో బిజెపి తిరిగి గెలవలేక పోయింది.
2012 ఎన్నికలలో కాంగ్రెస్ 32, బిజెపి 31 సీట్లు గెల్చుకోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే బీఎస్పీ, స్వతంత్ర సభ్యుల మద్దతుతో విజయ్ బహుగుణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. 2013లో వరదల భీబత్సాహం కారణంగా ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత మూడు సార్లు హరీష్ రావత్ కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. రెండు సార్లు రాష్ట్రపతి పాలన విధింపవలసి వచ్చింది. 2016లో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో 9 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు డివిజన్ కోరడంతో ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకొని, రాష్ట్రపతి పాలనకు దారితీసింది.
కాగా, తానూ ముఖ్య‌మంత్రిని అవుతాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని ఉత్త‌రాఖండ్ నూత‌న ముఖ్య‌మంత్రి తీరథ్ ‌సింగ్ రావ‌త్ పేర్కొన్నారు. ఒక చిన్న గ్రామం నుంచి వ‌చ్చిన తాను రాస్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఎంపిక‌వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని తెలిపారు.
 
త‌న‌పై అపార‌మైన‌ న‌మ్మ‌కం ఉంచి త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి, పార్టీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ క్ష‌ణం నుంచి అన్ని విష‌యాల్లో రాష్ట్ర‌ ప్ర‌జ‌ల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే న‌డుచుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు. గ‌త నాలుగేండ్ల త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్తాన‌ని పేర్కొన్నారు.