ఎన్‌కౌంటర్‌లో అల్ బదర్ చీఫ్ గ్యానీ ఖ్వాజా హతం

 సోపోర్‌లోని తుజ్జార్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ అయిన అల్ బదర్ చీఫ్ గ్యానీ ఖ్వాజాను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఈ ఎన్‌కౌంటర్‌ను ధ్రవీకరించారు. 
 
భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయంగా ఓ ట్వీట్‌లో అభివర్ణించారు. తుజ్జార్ గ్రామంలో ఇద్దరు ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఆర్మీ బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
 
భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పులు ప్రారంభమైన వెంటనే పోలీసులు ఓ ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతడిని ఇప్పుడు అల్ బదర్ చీఫ్ గ్యాన్ ఖ్వాజాగా గుర్తించారు. 
 
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలు, ఇతర మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. 
 
అల్ బాదర్ కు చెందిన ఉగ్రవాదులు గత నెల ఫుల్వమా దాడి రెండవ సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున పేలుడు జరపడం కోసం కుట్రపన్నాగా భద్రతా దళాలు భగ్నం కావించాయి. జమ్మూ బస్సు స్టాండ్ వద్ద ప్రమాదకరమైన 6 కిలోల ఐఇడి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్  నుండి  వచ్చిన ఆదేశాల మేరకు ఈ  పన్నాగం చేసిన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.