160కు పైగా సీట్లతో బెంగాల్ బీజేపీదే…   ‘పీపుల్స్ పల్స్’

పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి స్పష్టమైన ఆధిక్యత లభిస్తుందని, మొత్తం 294 నియోజకవర్గాలలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన హైదరాబాద్ కు చెందిన ఎన్నికల పర్యవేక్షణ, పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ వెల్లడించింది. 
 
సంస్థాగతంగా బిజెపి బలహీనంగా ఉన్నప్పటికీ, స్థానికంగా బలమైన నాయకత్వం ఆ పార్టీకి లేకపోయినప్పటికీ అధికార పక్షం పట్ల ప్రజలలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ప్రజలలో అంతర్లీనంగా స్పష్టం కావడంతో బిజెపి ఎన్నికలలో పెద్ద ఎత్తున లబ్ది పొందబోతున్నట్లు ఆ సంస్థ పరిశోధన డైరెక్టర్ డా. సజ్జన్ కుమార్ తెలిపారు. 
 
‘పీపుల్స్ పల్స్’  అంచనా ప్రకారం ప్రస్తుతం బిజెపికి 160 నియోజకవర్గాలలో ఆధిక్యత  కనిపిస్తుండగా, తృణమూల్ కాంగ్రెస్ 70, వామపక్షాలు 12 చోట్ల మాత్రమే ఆధిక్యతలో ఉన్నారు. ఇవి కాకుండా బిజెపి – టిఎంసి ల మధ్య 39, టిఎంసి – వామపక్షాల మధ్య  5, టిఎంసి, బిజెపి, వామపక్షాల మధ్య 7 నియోజకవర్గాలలో తీవ్రమైన పోటీ నెలకొన్నది. 

తాము అన్ని నియోజకవర్గాలలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసిన డిసెంబర్, 2020 తర్వాత జరిగిన పలు ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకొన్నప్పటికీ ఓటర్ల రాజకీయ మానసిక పరిస్థితి, వారిలో రూపుదిద్దుకున్న అసంతృప్తి ఆధారంగా తాము ఈ అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 

నాయకత్వం, అభ్యర్థి సామర్ధ్యం, సంస్థాగత ఉనికి, వివిధ సమస్యల ప్రభావం వంటి అంశాలు ఎన్నికల ఫలితాలలో మార్పు తీసుకు వచ్చే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. అయితే తమ క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రజలలో అధికారపక్షం పట్ల వ్యక్తమైన వ్యతిరేకత మార్పుకు వీలులేనిదిగా తమకు స్పష్టమైనదని తెలిపారు. అందుకనే ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల ముందుకు వచ్చే ఇతర అంశాలు వారి నిర్ణయంలో పెద్దగా మార్పు తీసుకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. 
 
అబ్బాస్ సిద్దికీ ప్రభావం కారణంగా మైనారిటీల ఓట్లలో చీలిక వస్తుందని అందరితో పాటు మైనారిటీలు కూడా భావిస్తున్నప్పటికీ అధికార పక్షానికి మూడు జిల్లాలో మినహా మొత్తం మైనారిటీ ఓట్లు గంపగుత్తుగా పడే అవకాశం ఉన్నట్లు డా. సజ్జన్ కుమార్ తెలిపారు. అయితే  ” హిందువుల ఓట్లు బిజెపికి మద్దతుగా సమీకృతం అవుతూ ఉండగా, ముస్లింల ఓట్లలో చీలిక రావచ్చు” అని నేడు ప్రబలంగా నెలకొన్న అభిప్రాయం అధికార పక్షంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 
 
ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం కోసం మమతా బనెర్జీ ప్రభుత్వం చేబడుతున్న పలు విధానపరమైన నిర్ణయాలు, రాజకీయ చర్యలను ప్రస్తావిస్తూ ఎన్నికలకు ఆరు నెలల ముందు అధికార పక్షాలు చేబడుతున్న చర్యలు ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి దేశంలో ఎక్కడా తోడ్పడటం లేదని డా. సజ్జన్ కుమార్ గుర్తు చేశారు. అందుకనే పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వ వ్యతిరేకతను కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చని స్పష్టం చేశారు. 
 
నాయకత్వ అంశానికి సంబంధించి, ఇతరులతో  ప్రజలలో మంచి ప్రభావం చూపుతున్న ముఖ్యమంత్రి మమతా బనెర్జీ ఇమేజ్ ఆమె  పార్టీకి చెందిన ఇతర  నాయకులపై గల ప్రతికూల ప్రభావంతో కొట్టుకు పోయే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తెలుపుతున్నది. 
 
ఆమె ప్రభుత్వం రోజువారీ ప్రజల జీవనాలలో కలిగించిన చేదు  అనుభవాల దృష్ట్యా ఈ ప్రతికూల ప్రభావాన్ని ఆమెకు గల ఇమేజ్ తటస్థం చేయలేదని అంచనా వేస్తున్నారు. సైద్ధాంతిక వాదనలు ప్రజాదరణ గాలిని తిప్పికొట్టలేవు. బెంగాల్ నేడు ఖచ్చితంగా మార్పును చూస్తుందని ఈ సర్వే స్పష్టమైన అభిప్రాయం కలిగిస్తున్నది. 
బెంగాల్ లోని అన్ని  ప్రాంతాలలో కూడా బిజెపి అనుకూల వాతావరణం కనబడుతున్నట్లు డా. సజ్జన్ కుమార్ ప్రాంతాల వారీగా   వివరించారు. 
22 నియోజకవర్గాలతో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అత్యధికంగా ఉన్న ఉత్తర బెంగాల్ లో అన్ని సీట్లలో బిజెపి ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తున్నది. 
 
47 నియోజకవర్గాలున్న మైనారిటీలు అత్యధికంగా గల ఉత్తర దీనజపూర్ ప్రాంతంలో మాత్రమే టిఎంసి అత్యధికంగా 17 సీట్లు గెలుపొందే అవకాశం ఉండగా, వామపక్షాలు 11, బిజెపి 10 నియోజకవర్గాలలో ముందంజలో ఉంది. మిగిలిన నియోజకవర్గాలలో తీవ్రమైన పోటీ ఉంది. 
49 నియోజకవర్గాలున్న మధ్య బెంగాల్ – బీర్బుమ్ ప్రాంతంలో బిజెపి 30, టిఎంసి 11, వామపక్షాలు 1 నియోజకవర్గాలలో ఆధిక్యతలో ఉండగా, మరో 7 చోట్ల తీవ్రమైన పోటీ ఉంది. 
 
42 నియోజక వర్గాలున్న జంగల్ మహల్ – పురూలియా ప్రాంతంలో బిజెపి 33, టిఎంసి 5 చోట్ల ఆధిక్యతలో ఉండగా, మరో 4 చోట్ల తీవ్రమైన పోటీ నెలకొంది. 126 నియోజకవర్గాలున్న కీలకమైన హుగ్లీ, హౌరా, కొలకత్తా, 24 పరాగణాల ప్రాంతంలో బిజెపి 65, టిఎంసి 35 చోట్ల ఆధిక్యతలో ఉండగా, మిగిలిన చోట్ల తీవ్రమైన పోటీ జరుగుతున్నది.