బిజెపిలోకి ఐదుగురు టిఎంసి ఎమ్యెల్యేలు 

పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఐదుగురు ప్రస్తుత ఎమ్యెల్యేలు నేడు బీజేపీలో చేరారు. 
ఎమ్మెల్యేలు సోనాలి గుహ, సీతల్‌ సర్దార్‌, దీపేందు బిశ్వాస్‌, రవీంద్రనాథ్‌ భట్టాచార్య, జతు లహిరిలు కాషాయ పార్టీలో చేరారు. తృణమూల్‌ ఎమ్మెల్యేలతో పాటు హబీబ్‌పూర్‌ నుంచి ఆ పార్టీ అభ్యర్థి సరళా ముర్ము కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌ బిజెపి అధ్యక్షుడు‌ దిలీప్‌ ఘోష్‌, పార్టీ నేతలు సువేందు అధికారి, ముకుల్‌ రాయ్‌ల సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు తృణమూల్‌ ఎమ్మెల్యేలు, ఎంపీ, పెద్ద సంఖ్యలో నేతలు కాషాయ పార్టీలో చేరడంతో బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇచ్చే స్ధితికి ఎదిగింది. గతవారం బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ల సమక్షంలో మాజీ కేంద్ర రైల్వే మంత్రి, టీఎంసీ నేత దినేష్‌ త్రివేది బీజేపీలో చేరారు.
 
కాగా, దిగ్గజాల మధ్య పోరుగా చెబుతున్న నందిగ్రామ్‌లో ఒక్కసారిగా నామినేషన్ల వేడి పెరుగుతోంది. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 10న నామినేషన్ వేస్తున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించగా, బీజేపీ అభ్యర్థిగా మమతను ఢీకొంటున్న సువేందు అధికారి 12వ తేదీన నామినేషన్ వేయనున్నట్టు ఆ పార్టీ సోమవారంనాడు ప్రకటించింది.