విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు

విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ డైరెక్టర్‌ మన్నెం నాగేశ్వర్‌రావు పిలుపిచ్చారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఏబీవీపీ 39వ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

ప్రస్తుతం దేశంలో అన్ని వర్గాల వారికి విద్య సమానంగా అందడం లేదని, దీంతో చాలా మంది విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

హిందూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని నాగేశ్వరరావు పేర్కొన్నారు. హిందూ ధార్మిక సంస్థలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయని, ఇతర మైనారిటీ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల మతమార్పిళ్లకు అడ్డుకట్ట లేకుండా పోతోందని తెలిపారు. 

ఈ పరిణామాలతో హిందూ సమాజం నష్టపోతోందని తెలిపారు. కాగా ఏబీవీపీ రాష్ట్ర నూతన కమిటీకి అధ్యక్షుడిగా పి.శంకర్‌, కార్యదర్శిగా ప్రవీణ్‌రెడ్డిలు ఎన్నికయ్యారు.