ఉద్యమ ద్రోహుల స్థావరంగా ప్రగతి భవన్ 

ఉద్యమకారులు రోడ్లపై ఉంటే ఉద్యమ ద్రోహులు ప్రగతి భవన్‌లో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం హన్మకొండలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మద్దతుగా జరిపిన సభలో మాట్లాడుతూ  తెలంగాణలో సీఎం కేసీఆర్, ఓవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాలయ్యాయని విమర్శించారు. 
 
ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకుని పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు.  ప్రపంచంలో సచివాలయం లేని రాష్ట్రం మన బంగారు తెలంగాణ అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువులుగా ఉన్న యూనివర్సిటీలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
 
2016లో రైల్వే ఓవరాలింగ్ పరిశ్రమను ఇచ్చాం.. కానీ 160ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని కిషన్ రెడ్డి చెప్పారు. బీబీనగర్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభమైనా… ప్రభుత్వం భూములను ఇవ్వలేదని చెప్పారు. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ 30 కోట్లు చెల్లించలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 
 
రూ  6వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమ తెచ్చామని చెబుతూ దానిని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏ జిల్లాలోనూ ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించలేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. 
 
బీజేపీకి పేరు వస్తుందని ఆయుస్మాన్ భారత్ పథకాన్ని ఇన్నాళ్లూ అడ్డుకుందని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకానికి కేసీఆర్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. వరంగల్‌లో డ్రబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మిస్తామన్నారు అవి ఎక్కడికి పోయాయి..? అని ప్రశ్నించారు. పేదలంటే కేసీఆర్‌కు చులకన అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. 
 
ముఖ్యమంత్రి సొంత ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ప్రాంతాలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించే అర్హత లేదని అంటూ జాగ్రత్తగా మాట్లాడాలని కిషన్ రెడ్డిహెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా కొనసాగుతోందని ఆరోపించారు. 
 
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకమని చెబుతూ  దుబ్బాకలో ప్రజలు టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో బీజేపీ సత్తా చాటిందని చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబంపై తెలంగాణ సర్వత్రా వ్యతిరేకతతో ఉందని, మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ  అది బీజేపీతోనే సాధ్యమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.