వాలంటీర్లపై ఎస్ఈసీకి అధికారం ఉంది 

మునిసిపల్ ఎన్నికల సందర్భంగా వార్డ్ వాలంటీర్లు అధికారిక ఫోన్ లను దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఉన్నదని ఏపీ హై కోర్ట్ స్పష్టం చేసింది. ఈ విషయమై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌ను డివిజనల్ బెంచ్ విచారించి వాలంటీర్లు తమ ఫోన్లను వెంటనే మున్సిపల్ కమిషనర్‌కు సరెండర్ చేయాలని, అధికారిక పని ఏదైన ఉంటే ఫోన్ చూసుకుని వెంటనే ఇచ్చేయాలని, ఎన్నికల పనులపై ఫోన్లు ఉపయోగిస్తే.. ఎస్ఈసీకి చర్యలు తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజనల్ బెంచ్ ఆ మేరకు సవరించింది.

మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లను దూరంగా ఉంచుతూ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గత నెల ఫిబ్రవరి 28న ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది.  వాలంటీర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు నిర్దిష్ట ఆధారాల్లేవని తెలిపింది.

ఈ నేపథ్యంలో వారి విధులను నిలువరిస్తూ.. ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పలేమని పేర్కొంది. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వలంటీర్లను విధులు నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టు అభిప్రాయపడుతోందని తెలిపింది.

వారిని దూరంగా ఉంచాలని ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై స్టే ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఎస్‌ఈసీ డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది.