అంచనాలకు మించి అప్పులు చేయడం వాస్తవమే 

అంచనాలకు మించి అప్పుచేసిన విషయం వాస్తవమేనని రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ఒప్పుకున్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని కాగ్‌ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆర్థికమంత్రి దానిపై గురువారం వివరణ ఇస్తూ కరోనా వల్ల రాబడి తగ్గడమే కాకుండా ఖర్చు విపరీతంగా పెరిగిందని తెలిపారు. 

గత ప్రభుత్వం ప్రాధాన్యత లేని ఖర్చులు చేసిందని విమర్శిస్తూ 2014 నాటికే ఏపీ రెవెన్యూ లోటుతో ఉందని గుర్తు చేశారు. కోవిడ్‌ వల్ల రాబడి విపరీతంగా తగ్గిపోయిందని, అదేవిధంగా ఖర్చు కూడా పెరిగిందని చెప్పుకొచ్చారు. అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి తాము అప్పులు చేశామని మంత్రి పేర్కొన్నారు

గతేడాది సరిగ్గా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కరోనా నియంత్రణకు ప్రతి రోజూ రూ.వందల కోట్లు వెచ్చించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రం నుండి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను తెచ్చుకున్నామని చెప్పారు. ఇటీవల కాగ్‌ తన రిపోర్టులో..పదినెలలకు గానూ రాష్ట్రం రూ.73,913 కోట్లు రుణం తీసుకుందని పేర్కొంది. 

బడ్జెట్‌ అంచనా రూ.48,295 కోట్లు కాగా, ఇది అంచనా కన్నా 153శాతం ఎక్కువని తేల్చింది. రెవెన్యూ లోటు పెరిగిపోతోందని, ఇది 300శాతం అధికమని కాగ్‌ చెబుతోంది. బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ.18,434 కోట్లు అంచనా వేయగా అసలు రెవెన్యూ లోటు రూ.54,046 కోట్లు ఉందని రిపోర్టులో నివేదించింది.

సంక్షేమ కార్యక్రమాలతో అప్పుల ఊబిలో ఏపీ చిక్కుకుందని, గతేడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు రూ.46,503 కోట్లు తీసుకుందని తెలిపింది. బహిరంగ మార్కెట్‌ రుణాల సేకరణలో ఏపి దేశంలోనే 4వ స్థానంలో ఉందని కాగ్‌ వివరించింది.