నామినేషన్ల ఉప సంహరణల వీడియో తీయండి 

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణలను యాంత్రికంగా అనుమతించొద్దని,  అభ్యర్థిత్వాన్ని ఉప సంహరించుకోవడానికి సంబంధించిన కార్యకలాపాలను రిటర్నింగ్‌, ఎన్నికల అధికారులు వీడియో తీయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సిసి పుటేజీలను ఎన్నికల రికార్డుగా భద్రపర్చాలని సూచించారు. 

మూడో పక్షం నుంచి నామినేషన్ల ఉపసంహరణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని స్పష్టం చేశారు. పొద్దుటూరు మున్సిపల్‌ కమిషనరు సెలవులో వెళ్లినందున సహాయ కమిషనరుకు ఆ బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలిపారు. పలు రాజకీయ పార్టీల నుంచి బలవంతంగా తమ అభ్యర్థులను విత్‌డ్రా చేయిస్తున్నారని, మూడో పక్షం నుంచి నామినేషన్ల ఉప సంహరణలు జరుగుతున్నాయని ఎస్‌ఇసికి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు ఎస్‌ఇసి పేర్కొన్నారు.

నామినేషన్లు దాఖలు కాకుండా, సాంకేతిక కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన 12 గ్రామ పంచాయతీలు, 725 వార్డులకు కొత్త నోటిఫికేషన్‌ను బుధవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 4న ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు గడువుగా ప్రకటించారు.

7న నామినేషన్ల పరిశీలన, 8 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లపై ఫిర్యాదుల స్వీకరణ ఉంటుంది. 15న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని ఎస్‌ఇసి పేర్కొంది. 

కాగా, పురపాలక ఎన్నికల్లో 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. అంతేగాక.. నామినేషన్ల అడ్డగింతలు, బలవంతపు ఉపసంహరణల విషయంలో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ గత నెల 16న ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కూడా సస్పెండ్‌ చేసిం ది. 

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీవీఎస్‌ సోమయాజులు బుధవారం తీర్పు ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేయడానికి అడ్డంకులు ఎదుర్కొన్న అభ్యర్థులు ఎన్నికల ట్రైబ్యునల్‌ను మాత్రమే ఆశ్రయించాలని స్పష్టం చేశారు.