అంబానీ ఇంటి సమీపంలో పేలుడుపై వివాదాలు!

పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రేపిన కలకలం మరింత ముదురుతోంది. ముంబైలోని అంబానీ ఇంటిముందు అనుమానాస్పందంగా కనిపించిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ (45) శవమై తేలడం వివాదాన్ని మరింత రాజేస్తోంది. 
 
హిరేన్ మృతి వెనుక ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్ వాజ్  పాత్రపై అనేక అనుమానాలను మహారాష్ట్ర మాజీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తం చేశారు. ఈ కేసులో చోటుచేసుకున్న అనేక సంఘటనలు అనుమానాలకు తావిస్తోందనీ పేర్కొంటూ  దీనిపై ఉన్నత స్థాయి దర్యప్తు జరపాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర శాసనసభలో  శుక్రవారం మాట్లాడుతూ అంబానీ బెదిరింపు కేసులో అనుమానాలకు దారితీసే అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మన్సుఖ్‌ని,  వాజ్‌  టెలిఫోన్‌ సంభాషణ జరిగిందని ఆరోపించారు.

అంతేకాదు పోలీసు కమిషనరేట్‌కు సమీపంలో ఉన్న దక్షిణ ముంబైలోని  క్రాఫోర్డ్ మార్కెట్‌లో మన్సుఖ్‌ని వాజ్‌  కలిశారని చెప్పుకొచ్చారు.  అలాగే కొంతమంది పోలీసులు అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మన్సుఖ్ తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని  ఫడ్నవీస్ ప్రశ్నించారు. 

మరోవైపు మన్సుఖ్‌ను కలిసారాన్న ఆరోపణలను సచిన్ వాజ్ ఖండించారు. మన్సుఖ్ థానేకు చెందినవాడు కాబట్టి తనకు తెలుసు అంతేకానీ, ఇటీవలి కాలంలో అతడిని కలవలేదని స్పష్టం చేశారు. అలాగే తనను వేధిస్తు‍న్నట్టుగా మన్సుఖ్ ఫిర్యాదు చేశాడని ధృవీకరించారు.  

అలాగే ఈ కేసులోఅంబానీ  నివాసానికి చేరుకున్న మొదటి వ్యక్తిని తాను కాదని, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గామ్దేవి అని,  ఈ తరువాత  క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు స్పాట్ చేరుకున్నానని వివరణ ఇచ్చారు. అలాగే క్రాఫోర్డ్ మార్కెట్‌లో మన్సుఖ్‌ను కలిశాననే ఆరోపణలు అబద్ధమని కొట్టి పారేశారు.

కాగా ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ మన్సుఖ్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వాహన విడిభాగాల వ్యాపారం చేసే మన్సుఖ్, తన ఎస్‌యూవీని ఎవరో దొంగిలించారంటూ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు  పోలీసులు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గురువారం రాత్రి  కనిపించకుండా పోయిన మన్సుఖ్‌ శుక్రవారం అనుమానాస్పద రీతిలో శవమై తేలడం కలకలం సృష్టించింది.